బాగా పనిచేస్తున్న ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహంలోని ‘పాపా’ పేలోడ్‌

ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహంలోని ‘ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్‌ ఆదిత్య (పాపా)’ పేలోడ్‌ విజయవంతంగా పనిచేస్తున్నదని ఇస్రో తెలిపింది. దీని అధునాతన సెన్సార్లు ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సంభవించిన పరిణామాలతోపాటు కరోనల్ మాస్ ఎజెక్షన్‌ల (సీఎంఇల) ప్రభావాన్ని గుర్తించినట్లు ఇస్రో ట్విట్టర్‌లో వెల్లడించింది.

పాపాలో రెండు సెన్సార్లు ఏర్పాటుచేశారు. అందులో ఎలక్ట్రాన్‌లను కొలవడానికి ‘సోలార్ విండ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ ప్రోబ్ (స్వీప్)’, అయాన్‌లను కొలవడానికి ‘సోలార్ విండ్ అయాన్ కంపోజిషన్ ఎనలైజర్ (స్వీకార్)’ ఉన్నాయి. రెండు సెన్సార్లు సౌర పవన కణాలు ఏ దిశ నుంచి వస్తున్నాయో గుర్తించగలుగుతాయి.

ఈ సెన్సార్లు డిసెంబర్‌ 12 నుంచి పనిలో ఉన్నట్లు ఇస్రో తెలిపింది. ఊహించిన విధంగా ప్రోటాన్లు, ఆల్ఫా కణాల కదలికను గుర్తించేలా ఒక స్పెక్ట్రాను రికార్డ్ చేసింది. జనవరి 6న ఆదిత్య-ఎల్‌1 హాలో ఆర్బిట్ ఇన్సర్షన్ సమయంలో తాత్కాలికంగా పేలోడ్ ఓరియంటేషన్ మారినప్పుడు స్పెక్ట్రాలో కొంత డిప్ కనిపించినట్లు వెల్లడించింది.

డిస్కవర్, ఏస్  శాటిలైట్స్ ద్వారా డిసెంబర్ 15న వచ్చిన డేటాను ఇస్రో విశ్లేషించింది. ఆదిత్య ఎల్‌1లోని సీఎంఇ సెన్సార్లు ఎల్1 పాయింట్ వద్ద సౌరగాలి మార్పులకు అనుగుణంగా కణాల స్థానాల్లో మార్పులు గమనించినట్లు చెప్పింది. ఫిబ్రవరి 10, 11న కూడా సౌరగాలిలో స్వల్ప వ్యత్యాసాలు ఏర్పడినట్లు గుర్తించింది.