తెలంగాణలో కొత్తగా 15 అమృత్ భారత్ స్టేషన్లు

తెలంగాణలో కొత్తగా 15 అమృత్ భారత్ స్టేషన్లు
* నేడే ప్రధాని మోదీ శంకుస్థాపన
 
తెలంగాణలో 15 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు నిర్మించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. రూ.230 కోట్లతో ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ల తో పాటు రూ.169 కోట్లతో 17 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించనున్నట్లు అరుణ్ జైన్ తెలిపారు.

రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారని అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ 500 కు పైగా అమృత భారత్ రైల్వే స్టేషన్లకు భూమి పూజ, ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాసులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 

ఈ క్రమంలో రూ. 41,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన రెండు వేల రైల్వే, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ నేపథ్యంలో రూ.19,000 కోట్లకు పైగా ఖర్చుతో స్టేషన్లను పునరాభివృద్ధి చేయనున్నారు. స్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు.  తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.621 కోట్లు ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 40 అమృత్ భారత స్టేషన్ల అభివృద్ధికి ఖర్చు రూ. 2,245 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాన నరేంద్ర మోదీ 21 అమృత్ భారత్ స్టేషన్లు అభివృద్ధికి భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు.

దీంతోపాటు మోదీ దేశంలోని పలు ప్రాంతాల్లో దాదాపు రూ.21,520 కోట్లతో నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జి, అండర్‌పాస్‌లకు శంకుస్థాపన, ప్రారంబోత్సవం చేయనున్నారు. నిర్మాణ పనులు పూర్తైన లెవెల్ క్రాసింగ్ గేట్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు. వీటిలో ఢిల్లీలోని తిలక్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ కూడా ఉంది.

15 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు

జడ్చర్ల – రూ.10.94 కోట్లు, గద్వాల్ – రూ.9.49 కోట్లు, షాద్ నగర్ – రూ.9.59 కోట్లు, మేడ్చల్ – రూ.8.37 కోట్లు,  మెదక్ – రూ.15.31 కోట్లు, ఉందా నగర్ – రూ.12.37 కోట్లు, బాసర – రూ.11.33 కోట్లు, యకుత్ పురా – రూ.8.53 కోట్లు, మిర్యాలగూడ – రూ.9.50 కోట్లు, నల్గొండ – రూ.9.50 కోట్లు, వికారాబాద్ – రూ.24.35 కోట్లు, పెద్దపల్లి – రూ.26.49 కోట్లు, మంచిర్యాల – రూ.26.49 కోట్లు./ వరంగల్ – రూ.25.41 కోట్లు,  బేగంపేట్ – రూ.22.57 కోట్లు.

2014 -15లో రూ. 258 కోట్లుగా ఉన్న తెలంగాణ రైల్వే బడ్జెట్ కేటాయింపులను కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే 20 రెట్లు పెంచి 2024- 25 నాటికి రూ.5,070 కోట్లకు చేర్చడం తెలంగాణలో రైల్వే అభివృద్ధి మీద మోదీ ప్రభుత్వానికి నిబద్ధతను తెలియజేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఇంతవరకు ఎలాంటి రైలు సౌకర్యం లేని మెదక్, సిద్దిపేట లాంటి ప్రాంతాలకు కూడా కేంద్రం కొత్తగా రైలు సౌకర్యం అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఆదాయపరంగా అనుకూలంగా కాకపోయినా మల్లన్న భక్తుల కోసం కొమరవెల్లిలో నూతన రైల్వే హాల్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇలా ఉండగా, మానవ సహిత లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించే దిశగా రైల్వే శాఖ వేగంగా కృషి చేస్తుంది. దీని వల్ల రైళ్ల వేగం పెరగడమే కాకుండా రైలు, రోడ్డు ట్రాఫిక్ కూడా వేరుగా ఉంటాయి. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదని, నగరంలో ట్రాఫిక్‌ వ్యవస్థ కూడా సజావుగా సాగుతుందని భావిస్తున్నారు. రైళ్ల రాకపోకల కారణంగా లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద ట్రాలీలు, ట్రాలీలు, ఇతర వాహనాల రద్దీ ఉండదు. దీంతో ప్రమాదాలు తగ్గడమే కాకుండా రైలు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.