ఎన్నికల వేళ సిబిఐ విచారణకు రాలేనన్న కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకావాలని సిబిఐ పంపిన నోటీసు పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అశక్తత వ్యక్తం చేశారు. తాను విచారణకు హాజరుకాలేనంటూ సీబీఐకి కవిత లేఖ రాశారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. 
 
ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్య ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని వివరించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐని కవిత కోరారు. వీటితే పాటు లేఖలో కవిత పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 
 
మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సమయంలో నోటీసులు ఇవ్వడం అనే ప్రశ్నలు రేకెత్తిస్తోందని తన లేఖలో ఆమె పేర్కొన్నారు.
2022లో తనకు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారని, కానీ ఆ నోటీసులకు ఇప్పడు సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులకు చాలా వ్యత్యాసం ఉందని వెల్లడించారు. ఎలాంటి పరిస్థితు ల్లో నోటీసులు ఇచ్చారన్నదానిపై స్పష్టత లేదని కవిత పేర్కొన్నారు.
 
 బిఆర్‌ఎస్ తరఫున తాను ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఢిల్లీ రావడం వల్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.  సిబిఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని, పైగా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని ఆమె గుర్తు చేశారు. ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని తెలిపారు. 
 
ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని ఆమె ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో హామీ సిబిఐకి కూడా కూడా వర్తిస్తుందని పేర్కొంటూ గతంలోనూ సిబిఐ బృందం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని ఆమె చెప్పారు.  పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తనకు పార్టీ అధిష్ఠానం కొన్ని బాధ్యతలు అప్పగించిందని కవిత తెలిపారు. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైందని వివరించారు. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని లేఖలో ఆమె స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరశీలించండి అని కవిత ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు.