బీజేపీతో కలిసి తమిళ్ మానిలా కాంగ్రెస్ పోటీ 

* మ‌హిళా నేత‌ల‌ను ఎద‌గ‌నివ్వ‌ని కాంగ్రెస్
 
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమిళ మానిలా కాంగ్రెస్ పార్టీ అధినేత జీకే.వాసన్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు వెల్లడించారు. మంగళవారం తిరుప్పూర్ జిల్లా పల్లడంలో జరిగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరవుతున్నట్లు వివరించారు. 
 
దివంగత నేత జీకే మూపనార్ తమిళ మానిలా కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి తమ పార్టీ జాతీయ దృక్పథాన్ని కలిగి ఉంది. బీజేపీతో కలవాలనే నిర్ణయం తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మాత్రమేనని జీకే వాసన్ వివరించారు.  గతంలో జరిగిన రెండు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించింది. 
 
ప్రధానమంత్రిగా రెండు సార్లు నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయం తమిళ ప్రజలందరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల మద్దతుతో బీజేపీ గెలుపొందింది. దేశ ఆర్థికాభివృద్ధికి, పేదల అభ్యున్నతికి భరోసా ఇస్తున్న కమలం పార్టీ గెలుపునకు తమిళ ఓటర్లు అవకాశం ఇవ్వాలి. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది. పేదరికం తగ్గుతుందని జీకే వాసన్ పిలుపునిచ్చారు.
 

మరోవంక, కాంగ్రెస్ పార్టీలో నాయ‌కత్వ స్ధానాల్లో మ‌హిళ‌ల‌కు గుర్తింపు ఉండ‌ద‌ని, వారిని కీల‌క ప‌ద‌వుల్లో ప్రోత్స‌హించ‌రని తమిళనాడులో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి ఇటీవ‌ల బిజెపిలో చేరిన ఎస్‌. విజ‌య‌ధ‌ర‌ణి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో మ‌హిళ‌ల‌కు స‌రైన వేదిక లేద‌ని, 14 ఏండ్లుగా తాను మిన‌హా కాంగ్రెస్ పార్టీలో మ‌హిళా ఎమ్మెల్యే ఒక్క‌రు కూడా లేర‌ని ఆమె పేర్కొన్నారు. త‌న‌ను సైతం కాపాడుకోలేని దుస్ధితిలో ఆ పార్టీ ఉండ‌టం విచార‌క‌ర‌మ‌ని చెప్పారు. మ‌హిళ‌ల‌కు పార్టీలో ప‌లు అవ‌రోధాలు సృష్టిస్తార‌ని, వారి కుయుక్తులు భ‌రించ‌లేక ఆ పార్టీలో చేరిన 37 ఏండ్ల అనంత‌రం కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింద‌ని ఆమె ఆరోపించారు. నాయ‌క‌త్వ ప‌ద‌వులు మ‌హిళ‌ల‌కు ఇవ్వ‌రాద‌నే ప‌ద్ధ‌తి స‌రైంది కాద‌ని కాంగ్రెస్‌కు ఆమె హిత‌వు ప‌లికారు. 

మ‌హిళ‌ను కేవ‌లం ఎమ్మెల్యే అవ‌డంతోనే ఎందుకు ఆపాల‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఏడేండ్ల పాటు పార్టీ త‌న‌ను ఎదగ‌నివ్వ‌లేద‌ని ఆరోపించారు. బీజేపీ మ‌హిళ‌ల్లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను గుర్తించి అర్ధం చేసుకున్నందునే తాను ఆ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని ఆమె చెప్పారు. విల్వ‌న్‌కోడ్ ఎమ్మ‌ల్యే విజ‌య‌ధ‌రణి రాజీనామాను ఇటీవ‌ల అసెంబ్లీ స్పీక‌ర్ ఆమోదించారు. 

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చార‌ని, ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు చేశార‌ని ఆమె ప్ర‌శంస‌లు గుప్పించారు. క‌న్యాకుమారి జిల్లాలో బీజేపీకి గ‌ట్టి ప‌ట్టున్న విల్వ‌న్‌కోడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2021లో విజ‌య‌ధ‌రణి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.