తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా  రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఒక పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్రాసిన లేఖలో  2014 లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన దుస్థితికి నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్ధం పడుతోందని విమర్శించారు. 
 
ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పెరుగుతున్న రాష్ట్ర తలసరి అప్పు కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తోందని పేర్కొంటూ ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.   రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రహిత ఋణాల మీద ఆధారపడటం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉందో తెలుస్తోందని విచారం వ్యక్తం చేశారు.
 
పైగా, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న ఋణాలకు వడ్డీలు చెల్లించడానికి ఋణాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఋణాలు, రైతు భరోసా నిధులకు ఋణాలు, సంక్షేమ పథకాల అమలుకు ఋణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఋణాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉందని ఆయన ధ్వజమెత్తారు.

2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టో ద్వారా 6 ప్రధాన గ్యారంటీలతోపాటుగా 420 హామీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే,  ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలునుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 
 
ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ సోనియా గాంధీ-రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ. 1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన తీరును చూస్తుంటే, రాష్ట్ర ఖజానా నిల్ – కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్ అన్న విషయం అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
గత 12 సంవత్సరాల కాలంలో కేంద్రం లోని మోదీ ప్రభుత్వం దాదాపు రూ. 12 లక్షల కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని ఆయన చెప్పారు.