తెలంగాణలో మెజారిటీ పార్లమెంట్ స్థానాలకై బీజేపీ కసరత్తు

తెలంగాణలో మెజారిటీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం కసరత్తు చేపట్టింది. ఈమేరకు శనివారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ నాయకత్వంతో జరిగిన తెలంగాణ కోర్ గ్రూప్ సమావేశంలో తెలంగాణలోని 17 స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల గురించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. 
 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ ఇంఛార్జిలు తరుణ్ చుగ్, చంద్రశేఖర్, సునీల్ బన్సల్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి శివ ప్రకాష్ తదితరులు పాల్గొనగా. తెలంగాణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, డా. కే. లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు హాజరయ్యారు.
 
తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. 17 లోక్‌సభ స్థానాల్లో 4 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులుండగా, మిగతా 13 స్థానాల్లో ఆశావహులు, వారి బలాబలాలు, సామాజిక సమీకరణాల గురించి చర్చ జరిగింది. ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఆశావహులున్నారు.  కాగా, ఇప్పటికే  6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరో 11 స్థానాల్లో కూడా ఒక్కో సీటుకు రెండేసి పేర్లతో.. మరో జాబితాను జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
 
కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ నుంచి, బండి సంజయ్ కరీంనగర్‌ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీలుగా బరిలో దిగనున్నారు. వారితోపాటు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల నుంచి, డాక్టర్ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీచేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
 
ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ స్థానం నుంచి డీకే అరుణ్, జితేందర్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, మురళీధర్ రావుతో పాటు ప్రైవేట్‌ విద్యా సంస్థల అధిపతి మల్క కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. 
 
వీళ్లతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీచేసి ఓడిపోయిన రఘునందనరావుకు కూడా మెదక్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.  ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో కూడా గెలుపు సాధిస్తామంటూ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఉండగా, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో కొందరు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు, మంతనాలు సాగిస్తున్నారు. వారి పేర్లను కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. మొత్తంగా రాష్ట్ర కోర్ కమిటీ ఎంపిక చేసిన సుమారు 50 పేర్లతో కూడిన జాబితాను కిషన్ రెడ్డి నడ్డాకు అందజేశారు.  ఫిబ్రవరి 29న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లేదా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి మెజారిటీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. 

ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకన్నా ముందుగానే లోక్‌సభ ఎన్నికలకు అధికార బిజెపి తొలి జాబితా సుమారు ద మంది పేర్లతో వచ్చే వారం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికలలో బిజెపి సొంతంగా 370 , ఎన్‌డిఎ కూటమి మిత్రపక్షాలతో కలిపితే 400 స్థానాలు దక్కించుకోవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.