దేశంలోనే అతిపొడవైన కేబుల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభించిన ప్రధాని

* సముద్రం లోపలికి వెళ్లి ద్వారకను సందర్శించిన మోదీ
దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. గుజరాత్‌లోని ద్వారకలో ఈ వంతెనను నిర్మించారు. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి ‘సుదర్శన్‌ సేతు’ అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకతో అనుసంధానిస్తుంది.  బీట్ ద్వారకలోని శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత మోదీ ‘సుదర్శన్ సేతు’ పేరుతో ఉన్న నాలుగు లేన్ల కేబుల్ వంతెనను ప్రారంభించారు.
అంతేగాక నీట మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకను ప్రధాని  సందర్శించారు. ఆక్సిజన్ మాస్కు పెట్టుకుని సముద్రం లోపలికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అగాధ జలాల్లో మునిగి ఉన్న ద్వారకా నగరిలో ప్రార్థనలు జరిపేందుకు వెళ్లడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగించిందని ప్రధాని చెప్పారు.  ప్రాచీన కాలం నాటి ఆధ్యాత్మిక వైభవానికి, కాలాతీత భక్తి భావానికి తాను అనుసంధానమయ్యానన్న భావన కలిగిందని తెలిపారు. భగవాన్ శ్రీకృష్ణుడి దీవెనలు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఫొటోలను షేర్‌ చేశారు.
ఈ వంతెన నిర్మాణానికి 2017 అక్టోబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు.  27.20 మీటర్ల వెడల్పుతో, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్‌కు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్‌లు కూడా ఉన్నాయి. మధ్యలో 900 మీటర్ల పొడవైన కేబుల్-స్టేడ్ స్పాన్, వంతెనపైకి చేరుకోవడానికి 2.45 కిలోమీటర్ల పొడవైన రహదారి ఉంది.
 
సుదర్శన్‌ సేతును ఒక ప్రత్యేకమైన డిజైన్‌తో నిర్మించారు. బ్రిడ్జ్‌ ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు. ఈ వంతెనకు సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయడంతో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ద్వారకాదీశ్ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ వంతెన ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వంతెనను గతంలో ‘సిగ్నేచర్ బ్రిడ్జ్’ అని పిలిచేవారు. ఇప్పుడు దాని పేరు ‘సుదర్శన్ సేతు’గా మార్చారు.
బేట్ ద్వారకా అనేది ఓఖా నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక ద్వీపం. ద్వారకా నగరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీకృష్ణుని ప్రసిద్ధ ద్వారకాధీష్ ఆలయం ఉంది. వంతెన నిర్మాణానికి ముందు యాత్రికులు బైట్ ద్వారకకు చేరుకోవడానికి పడవ రవాణాపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ వంతెన నిర్మాణంతో వారు ఎప్పుడైనా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లక్షద్వీప్‌లో నివసించే ప్రజలు కూడా దీని వల్ల ప్రయోజనం పొందుతారు.

కాగా, ప్రధాని మోదీ నేడు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం ఆయన రాజ్‌కోట్‌లోని (గుజరాత్) తొలి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రారంభిస్తారు. ఆ తరువాత ఏపీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో ఎయిమ్స్ ఆసుపత్రులను కూడా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మొత్తం రూ.6300 కోట్లతో నిర్మించారు.