ఐఆర్‌జీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ధ్వంసం

ఐఆర్‌జీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ధ్వంసం
 
* ఇజ్రాయిల్ వైమానిక స్థావరాలపై దాడి.. ముగ్గురు భారతీయులు మృతి
 

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండ్ కంట్రోల్ సెంటర్లను ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ సైన్యం, ఐఆర్‌జీసీలకు చెందిన కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం ఉదయం దాడులు చేశామని వెల్లడించింది. ఈ దాడుల్లో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, మిస్సైళ్లు, డ్రోన్ల లాంచ్ ప్యాడ్లు, వైమానిక స్థావరాలు కూడా ధ్వంసం అయ్యాయని తెలిపింది. బీ-1 బాంబర్ విమానాలతో ఇరాన్‌‌లోని బాలిస్టిక్ మిస్సైల్ తయారీ, నిల్వ యూనిట్లపైనా దాడులు చేశామని పేర్కొంది.

తాము హార్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు ఆ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పుపెడతామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని స్ట్రాంగ్‌గా చెప్పింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న సంఘర్షణ మధ్య మధ్యప్రాచ్య ప్రాంతంలో విదేశీ జెండాలున్న నౌకల్లో ఉన్న కనీసం ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ మంగళవారం తెలిపింది.

“ఈ ప్రాంతంలో భారతీయ నావికులకు సంబంధించిన నాలుగు సంఘటనలు నమోదయ్యాయి, ఫలితంగా ముగ్గురు మరణించారు. ఒక నావికుడు గాయపడ్డాడు, వీరందరూ విదేశీ జెండాలున్న నౌకల్లో పనిచేస్తున్నారు” అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ తెలిపింది.

బహ్రయిన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ మరోసారి భీకర దాడులు చేసిందంటూ ఖతర్ మీడియా సంస్థ అల్ జజీరా సంచలన కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం, మంగళవారం తెల్లవారుజామున బహ్రయిన్‌ దేశంలోని అమెరికా వైమానిక స్థావరానికి (షేక్ ఈసా బేస్) చెందిన ప్రధానమైన కమాండ్ కంట్రోల్ భవనాన్ని పేల్చేశామని ఇరాన్ ఐఆర్‌జీసీ ప్రకటించింది. 20 డ్రోన్లు, 3 మిస్సైళ్లతో షేక్ ఈసా బేస్‌పై దాడి చేశామని తెలిపింది. 

సముద్ర జలాల్లో పలు ముడి చమురు ట్యాంకర్లకూ నిప్పు పెట్టామని ఐఆర్‌‌జీసీ పేర్కొంది. అమెరికా – ఇజ్రాయెల్ దాడులు కొనసాగినన్ని నాళ్లు, ఇరాన్ బలంగా ప్రతిఘటిస్తూనే ఉంటుందని ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ సయ్యిద్ ఇరావని తేల్చి చెప్పారు.

మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌లోని రమత్ డేవిడ్ వైమానిక స్థావరంపై లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లు డ్రోన్లతో దాడి చేశారు. పెద్దసంఖ్యలో డ్రోన్లు ఈ వైమానిక స్థావరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లపై పడ్డాయంటూ అల్ జజీరా కథనాన్ని ప్రచురించింది. సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతిగా, హిజ్బుల్లా ఈ ఎటాక్స్ చేసిందని పేర్కొంది. 

తాజాగా మంగళవారం (మార్చి 3) తెల్లవారుజామున బీరుట్ నగరంలోని హిజ్బుల్లా అనుబంధ టీవీ ఛానల్ అల్ మనార్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఆ టీవీ ఛానల్ భవనం తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ ఈ ఎటాక్ జరిగిన కొన్ని నిమిషాలకే, ఆ ఛానల్ మళ్లీ ప్రసారాలను మొదలుపెట్టడం గమనార్హం. ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌ – పీఐజే  కమాండర్ అబూ హమ్జా రామిమృతి చెందాడు. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతంలోని హెజ్బొల్లా అనుబంధ అల్-మనార్ ప్రధాన కార్యాలయమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.