సందేశ్‌ఖలీ వెళ్తున్న నిజనిర్థారణ కమిటీ సభ్యుల అరెస్ట్

సందేశ్‌ఖలీ వెళ్తున్న స్వతంత్ర నిజనిర్థారణ కమిటీ సభ్యులను ఆదివారం బెంగాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భోజెర్‌హట్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. కమిటీలోని ఆరుగురు సభ్యులను అరెస్ట్‌ చేశారని, అరెస్ట్‌ తర్వాత వారిని పిహెచ్‌క్యూ సభ్యులను లాల్‌బజార్‌ కోల్‌కతాకు తరలించినట్లు తెలుస్తోంది.  

పాట్నా హైకోర్టు మాజీ సిజె జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి నేతృత్వంలోని ఆరుగురు సభ్యులు గల ఈ కమిటీలో  న్యాయవాది ఒపి వ్యాస్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి రాజ్‌పాల్‌సింగ్‌, నేషనల్‌ ఉమెన్‌ కమిషన్‌ మాజీ సభ్యురాలు చారు వలి ఖన్నా, న్యాయవాది భావ్‌నా బజాజ్‌, సీనియర్ జర్నలిస్ట్ సంజీవ్ నాయక్ లు ఉన్నారు. పోలీసుల అరెస్టును ఖండిస్తూ నిజనిర్ధారణ కమిటీ సభ్యులంతా ధర్నా చేపట్టారు.

తాము సందేశ్‌ఖలీకి వెళ్లి బాధిత మహిళలతో మాట్లాడాలనుకున్నామని, కానీ పోలీసులు వెళ్లనివ్వకుండా తమని అరెస్ట్‌ చేశారని నిజనిర్థారణ కమిటీ సభ్యురాలు చారుకన్నా తెలిపారు. సెక్షన్‌ 144ను ఉల్లంఘించబోమని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని ధ్వజమెత్తారు.

పోలీసులు సందేశ్‌ఖళీ నిజాలను దాచిపెడుతున్నారని ఈ నిజనిర్థారణ బృందం ఆరోపించింది. నిజాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తాము అక్కడికి బయలుదేరామని వివరించారు. తమను పోలీసులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నందుకు నిరసనగా ఈ నిజనిర్థారణ బృందం ఆరుబయట కూర్చుని ధర్నా సాగించారు.

“ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. చట్టాన్ని గౌరవించే పౌరులుగా మేము నిబంధనలను ఉల్లంఘించబోమని పోలీసులకు చెప్పాము. సందేశ్‌ఖాలీలో ఎటువంటి కర్ఫ్యూ విధించబడలేదు. కాబట్టి మేము రెండు గ్రూపులుగా వెళ్లవచ్చు. మా మహిళా సభ్యుల్లో కనీసం ఇద్దరిని అనుమతించాలి. మీడియా దిగ్భ్రాంతికరమైన నిజాన్ని వెలికితీసే వరకు ఈ రోజుల్లో రాజకీయ ప్రోత్సాహంతో, పోలీసులు పట్టించుకోని దౌర్జన్యశక్తుల అరాచకాలను భరించిన మహిళలను సందర్శించడానికి అనుమతించాలి” అని రెడ్డి స్పష్టం చేశారు. 

బోజెర్‌హట్‌ దాటి వెళ్లవద్దని కమిటీ సభ్యులను అభ్యర్థించామని, కానీ వారు చట్ట విరుద్ధంగా బారికేడ్‌ను బద్దలు కొట్టేందుకు యత్నించారని కోల్‌కతా పోలీస్‌, భాంగర్‌ డివిజన్‌, డిప్యూటీ కమిషనర్‌ సైకత్‌ ఘోష్‌ పేర్కొన్నారు. శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ముందస్తు అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్ లోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌, అతని అనుచరులు ఆ ప్రాంతంలో అనేక రకాలుగా అరాచకాలకు , భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, లైంగిక అత్యాచారాలకు దిగుతున్నాడనే విషయంపై ఇక్కడ భారీ స్థాయిలో నిరసనలు వెలువడుతున్నాయి.