రూ. 2,000 కోట్ల మాదక ద్రవ్యాల రాకెట్ వెనుక తమిళ నిర్మాత

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్‌ను ఛేదించి, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది. మిక్డ్స్ ఫుడ్ పౌడర్, కొబ్బరి పొడిలో దాచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు పంపుతున్న 50 కిలోల మాదకద్రవ్యాల తయారీ రసాయనాన్ని స్వాధీనం చేసుకుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్ వర్క్ సూత్రధారిని పరారీలో ఉన్న ఓ తమిళ సినీ నిర్మాతగా గుర్తించామని ఎన్సీబీ తెలిపింది.

అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు గత మూడేళ్లలో మొత్తం 45 సూడోపెడ్రిన్ డ్రగ్ ప్యాకేజీలను పంపినట్లు సమాచారం లభించిందని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు. సుమారు 3,500 కిలోల సూడోపెడ్రిన్ ఎగుమతులు జరిగాయని, వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 2,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

నాలుగు నెలల క్రితం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్సీబీ, ఢిల్లీ పోలీసు బృందాలు నెట్వర్క్‌ను నిర్వీర్యం చేశాయని జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. కొబ్బరిపొడిలో దాచిన సూడోపెడ్రిన్‌ను భారత్ నుంచి రెండు దేశాలకు తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) ఈ ఎగుమతులకు మూలం ఢిల్లీ అని పేర్కొంటూ అనుబంధ సమాచారం అందించిందని సింగ్ తెలిపారు.

ఎన్సీబీ, స్పెషల్ సెల్ అధికారులు రంగంలోకి దిగి ఫిబ్రవరి 15న పశ్చిమ ఢిల్లీలోని బసాయి దారాపూర్ ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్‌పై దాడులు నిర్వహించి బహుళ ధాన్యాల ఆహార మిశ్రమంలో దాచి ఉంచిన 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారని డీడీజీ తెలిపారు. సూడోపెడ్రిన్ అనేది ఒక రసాయనం. దీనిని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ప్రముఖ ఔషధం మెథాంఫేటమిన్ తయారీకి ఉపయోగిస్తారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కిలోకు సుమారు రూ. 1.5 కోట్లకు అమ్ముడవుతోందని ఎన్సీబీ తెలిపింది.