భారత వాణిజ్యవేత్తకు ‘ఎలిజబెత్-2’ మహారాణి రేంజ్ రోవర్ కారు

ఒకనాడు ‘రవి అస్తమించని సామ్రాజ్యా’నికి అధిపతి బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 దర్జాయే వేరు. ఆమె ఎక్కడికైనా వెళ్లడానికి రేంజ్ రోవర్ కారును ఉపయోగించే వారు. ఇటీవలే ఆమె మరణించడంతో ఎలిజబెత్-2 రాణి వాడిన ఈ రేంజ్ రోవర్ కారును భారత వాణిజ్యవేత్త, పూనావాలా గ్రూప్ ఎండీ యోహాన్ పూనావాలా సొంతం చేసుకున్నారు. 
 
బ్రామ్లీ యాక్షనీర్స్ వెబ్‌సైట్‌లో ఈ కారు ధర రూ.2.25 కోట్ల పై చిలుకు (2,24,850 పౌండ్లు) పలుకుతుంది. ఎలాంటి వేలం ప్రక్రియ చేపట్టకుండానే యోహాన్ పూనావాలా ఈ కారును ప్రైవేట్‌గా కొనుగోలు చేసి సొంతం చేసుకున్నారు. ఎంత ధరకు సొంతం చేసుకున్నారన్న సంగతి వెల్లడించలేదు.  అయితే, దివంగత మహారాణి ఎలిజబెత్-2 వినియోగించిన ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఇప్పటికీ కొనసాగిస్తుండటం ఆసక్తికర పరిణామం. 
 
విశేష చరిత్ర గల ఈ కారు సొంతం చేసుకున్నందుకు పూనావాలా ఆనందం వ్యక్తం చేశారు. తొలి రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే కొనసాగించడం తనకు అదనపు బోనస్ అని తెలిపారు. ఎంతో అద్భుతమైన ఆటోమోటివ్ చరిత్ర గల కారు సొంతం చేసుకున్నందుకు సంతోషిస్తున్నానని ఆయన చెప్పారని ఓ ఆంగ్ల దినపత్రిక తెలిపింది.మామూలు పరిస్థితుల్లో రాజ కుటుంబం ఆధీనం నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ కారు నంబర్ మార్చేస్తారు. కానీ మరణించిన మహారాణి ఎలిజబెత్-2 వాడిన రిజిస్ట్రేషన్ నంబర్ ఓయూ16 ఎక్స్‌వీహెచ్ ఇప్పటికీ కలిగి ఉండటం అదనపు బోనస్ అని పూనావాలా తెలిపారు. 

ఐవరీ ఆపోలహల్స్టరీతో లోయర్ బ్లూ పెయింట్ వేసిన 2016 రేంజ్ రోవర్ ఎస్డీవీ8 ఆటోగ్రఫీ ఎల్‌డబ్ల్యూబీ కారు దాదాపు 18 వేల మైళ్లు ప్రయాణించింది. ఎలిజబెత్-2 మహారాణి వినియోగించడానికి వీలుగా ఈ రేంజ్ రోవర్ కారును డిజైన్ చేశారు. రహస్య లైటింగ్, పోలీస్ ఎమర్జెన్సీ లైటింగ్ సహా స్పెషల్ మార్పులు ఉన్నాయి. 

మహారాణి తేలిగ్గా కారు ఎక్కి దిగడానికి వీలుగా వెనుక భాగంలో గ్రాబ్ హ్యాండిల్స్ జోడించారు. ఇలా ఎలిజబెత్-2 రాణి కోసం మార్పులన్నీ యధాతథంగా కొనసాగించాలని భావిస్తున్నానని యోహాన్ పూనావాలా చెప్పారు.