మార్చి 13 తర్వాతే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్!

* అంతర్గతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ విభాగం

మార్చి 13 తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని శుక్రవారం కమిషన్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ఈసీ బృందం‌  గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

ఈసీ బృందం ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తోంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, జమ్ము కశ్మీర్‌లలో పర్యటన చేయనుంది. ఈ రాష్ట్రాల పర్యటన మార్చి 13వ తేదీలోపే ముగియనుంది. మార్చి 13 తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించే అవకాశం ఉందని సదరు వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఎన్నికల ఏర్పాట్లను తెలుసుకునేందుకు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో(సిఇఓ) ఇసి సభ్యులు గత కొద్ది నెలలుగా తరచు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, ఇవిఎంల రవాణా, భద్రతా దళాల ఆవశ్యకత, సరిహద్దుల వద్ద గట్టి నిఘా వంటి అంశాలను సిఇఓలు ఇసి సభ్యులకు వివరించినట్లు అధికారులు తెలిపారు.

ఈ సారి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించాలని ఇసి భావిస్తున్నట్లు వారు చెప్పారు. మే నెలలోగా నిర్వహించే సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా సాగేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలసీని ఉపయోగించాలని ఇసి నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారాలలో తప్పుడు సమాచారాన్ని గుర్తించి దాన్ని తొలగించేందుకు ఇసిలో అంతర్గతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. ఎన్నికల కాలంలో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని, రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎవరైనా పోస్టు చేస్తే వెంటనే దాన్ని తొలగించడం జరుగుతుందని వారు చెప్పారు. 

ఏదైనా రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి అదేపనిగా నిబంధనలను అతిక్రమించిన పక్షంలో వారి సోషల్ మీడియా అకౌంట్లను సస్పెండ్ చేయడంతోపాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. వదంతులకు సంబంధించిన నిజ నిర్ధారణపై కూడా ఇసి దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. 

 సున్నితమైన ప్రాంతాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపటేలా చర్యలు తీసుకుంటుందని వారు వివరించారు. ఎన్నికల సంఘం వద్ద అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం లోక్‌సభ ఎన్నికలలో దాదాపు 96.88 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు.  ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న దేశంగా భారత్ రికార్డు సాధించనున్నది. అంతేగాక 18-19 వయసు ఉన్న యువ ఓటర్లు 1.85 కోట్ల మంది కొత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఇసి గణాంకాలు చెబుతున్నాయి.