మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి గుండెపోటుతో కన్నుమూశారు. ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గురువారం రాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబసభ్యులు పీడీ హిందుజా ఆస్పత్రికి తరలించారు. 

ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. 86 ఏళ్ల మనోహర్ జోషీ వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపారు. గత ఏడాది మే నుంచి జోషి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉంది. ఆయన మెదడులో రక్తస్రావం కావడంతో హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు. 

అక్కడ చికిత్స అనంతరం మెల్లగా కోలుకోవడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఇంటికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. గతేడాది డిసెంబరు 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా దాదర్‌లోని తన ఆఫీస్‌కు వచ్చారు. ఆయన మద్దతుదారుల సమక్షంలో వేడుకలను జరుపుకున్నారు. 

ఇక, 1937 డిసెంబరు 2 మహారాష్ట్రలోని మహద్‌లో జన్మించిన మనోహర్ జోషి.. ముంబయిలోని ప్రముఖ విద్యా సంస్థ వీర్‌మాతా జిజియాబాయ్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (వీజేఐటీ) నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఆర్ఎస్ఎస్‌తోనే మొదలైంది. తర్వాత శివసేనలో చేరారు.

1980వ దశకంలో ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన సంస్థాగత నైపుణ్యాలు, అట్టడుగు వర్గాలను కలుపుకుని వెళ్లే విధానం పార్టీలో సముచిత స్థాయికి తీసుకెళ్లాయి. 1995లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడం ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టం. 1999 వరకు తొలి శివసేన- బిజెపి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ ముఖ్యమంత్రిగా కొనసాగారు.

మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారులో 1999 నుంచి 2002 వరకూ భారీ పరిశ్రమల మంత్రిగా, అనంతరం 2002 నుంచి 2004 వరకూ లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే, 2006 నుంచి 2012 వరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

మనోహర్ జోషి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ రాజకీయాలలో `ఓ నాగరిక వ్యక్తి’ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జోషి భార్య అంగనా జోషి 2020లో 75 ఏళ్ళ వయస్సులో మృతి చెందారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి 1967లో రాజకీయ ప్రవేశం చేశారు. ముంబై మేయర్ గా పని చేసిన ఆయన మునిసిపల్ కౌన్సిలర్ గా, మూడు సార్లు ఎమ్యెల్సీగా, పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన అరుదైన ఘనత పొందారు.