కుటుంబాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ అభివృద్ధి

కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని జగన్ అనుకుంటే, తిరిగి ఆయన ఇంట్లోనే అది జరిగిందని జనసేన అధినేత  పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజవర్గ జనసేన నాయకులతో బుధవారం జరిపిన భేటీలో సొంత చెల్లికి ఆస్తి ఇవ్వని వ్యక్తి, మనకెలా ఇస్తాడు? అని నిలదీశారు. 
 
జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన, సమాజంలో సుస్థిరత కోల్పోయేలా చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబు వల్ల ఓ కులంపై చెడు ముద్ర వేశారని వాపోయారు. భీమవరం వైసీపీ ఎమ్మెల్యేతో తనకు శత్రుత్వం ఏమీ లేదని చెబుతూ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ప్రతిపాదన రాష్ట్ర బాగు కోసమే అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.

”గత ఎన్నికల్లో భీమవరం నుండి పోటీ చేయమని నాతో చెప్పిన సన్నిహితులు ఇప్పుడు ఇక్కడ లేరు. ఎన్నికల్లో భారీ బెట్టింగ్ లు జరుగుతున్నాయంటే జనసేన పోటీలో ఉండడమే కారణం. జగన్ సిద్ధం అంటే మేము యుద్ధం అంటాము. వైజాగ్ లో, ఏపీ సరిహద్దులో నన్ను ఆపాలని చూస్తే నా సత్తా చూపిస్తా” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు..

జాతీయ నాయకుల వద్ద ఎన్నో చీవాట్లు తిని పొత్తు కోసం పోరాడానని పవన్ తెలిపారు. కొన్ని ఇబ్బందులు, త్యాగాలు తప్పవన్న పవన త్యాగం చేసిన వారికి గుర్తింపు పక్కా అని హామీ ఇచ్చారు. “ఎన్నికల్లో ప్రతిపక్ష ఓటు చీలితే సీఎం జగన్ లాభపడతారు. ఇది జరగకుండా ఉండేందుకే పొత్తుకు నిర్ణయించాం. అయితే అది అంత సులభంగా జరగలేదు” అని తెలిపారు. 
 
“పొత్తు కోసం వెళ్లిన నేను జాతీయ నాయకత్వంతో ఎన్ని తిట్లు తిన్నానో నాకు తెలుసు. వాళ్లను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను. అనేక అవమానాలకు గురయ్యాను. స్వలాభం కోసం పొత్తును ఆశించలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత దూరమైన వెళ్తాను. అందుకే తిట్టినా భరించాను. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉండాలని కోరుకుంటున్నా” అని పవన్ వెల్లడించారు.

సీఎం జగన్ అప్పులు చేసి బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెబుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి బటన్ నొక్కాలని జనసేనాని డిమాండ్ చేశారు. “టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కొనసాగిస్తుంది. మాపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. కొందరికి భయపడే వ్యక్తిత్వం నాది కాదు” అని స్పష్టం చేశారు.

“ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లొచ్చినా నిలబెట్టుకోలేకపోయాం. జనసేనకు సీట్లు రాకపోయినా ఏళ్లుగా నిలబెట్టుకుంటూ వస్తున్నాం. నేను గాజువాకతో పాటు మరోచోట పోటీ చేయాలని అనుకుంటున్నాను. భీమవరంలో పోటీ చేయాలని కొందరు ఆహ్వానించారు. ప్రజలకు మాట ఇచ్చే ముందే బాగా ఆలోచిస్తా. మాట ఇచ్చాక ఆరునూరైనా నెరవేర్చేంతవరకు శ్రమిస్తూనే ఉంటాను” అని తెలిపారు. 

జగన్ తనను ఒంటరి వాడిని చేశారని అంటున్నారని పేర్కొంటూ అందరినీ పీడించిన తానే  ఒంటరివాడివెలా అవుతాడన్ని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. వైసీపీకి 50 సీట్లు కూడా కష్టమని కొందరు బెట్టింగ్లు వేస్తున్నారని చెబుతూ మీరు సిద్ధమంటే తానూ యుద్ధానికి సిద్ధమ అని పవన్ స్పష్టం చేశారు. 2009, 2014, 2019 ఎన్నికల పరిస్థితులు గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ”ఓట్లు కొనాలా లేదా అనేది నేను ఎవరికీ చెప్పను. ఓట్లు కొనే పరిస్థితి లేకపోవడమే సంతోషకరం. పదేళ్ల తర్వాత అయినా సరే డబ్బుతో ఓట్లు కొనని రాజకీయం రావాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం” అని పవన్ కల్యాణ్ తెలిపారు.