వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

నెల్లూరు జిల్లాలో అధికార వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్యెల్యేలు పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరగా, తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, వైఎస్ఆర్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి తెలిపారు. వేమిరెడ్డితో పాటు ఆయన భార్య, టీటీడీ సభ్యురాలిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి సైతం రాజీనామా చేశారు.  ‘‘ ఆర్యా.. నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరి జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిలా పార్టీ అధ్యక్ష పదవికి, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అంటూ పార్టీకి రాజీనామా లేఖలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
 
ఇక రాజ్యసభ ఎంపీ పదవి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ‘‘నేను, నా వ్యక్తిగత కారణాల వలన నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నాను’’ అంటూ ఎంపీ పదవి రాజీనామా చేసిన లేఖలో పేర్కొన్నారు. ఆయన సతీమణి వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి కూడా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని వైఎస్ జగన్ గతంలో నిర్ణయించారు. ఈ మేరకు టికెట్ కూడా ఖరారు చేశారు. అయితే తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి కోరుతూ రాగా అందుకు అధిష్టానం అంగీకరించలేదు. అలాగే తన భార్య వేమిరెడ్డి ప్రశాంతికి సీటు ఇవ్వాలని కోరుతున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని తెలిసింది.
 
ఇదే సమయంలో నెల్లూరు సిటీ ఇంఛార్జిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్థానంలో ఆయన అనుచరుడు ఖలీల్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ నిర్ణయం కూడా వేమిరెడ్డి అసంతృప్తికి కారణమని సమాచారం. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న తనకు పార్టీలో కనీస గౌరవం దక్కలేదని ఆయన అనుచరుల వద్ద చెబుతూ వచ్చారట. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది.
 
మరోవైపు వేమిరెడ్డి దంపతులు టీడీపీలో చేరతారనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు మాజీ మంత్రి నారాయణలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి టీడీపీ తరుఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తారని తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రశాంతికి కూడా అసెంబ్లీ సీటు కేటాయిస్తారని సమాచారం.