ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తం.. రైతులతో మరోసారి చర్చలు

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.రైతుల చలో ఢిల్లీ ఆందోళన బుధవారంనుంచీ మళ్ళీ ప్రారంభం కావడంతో శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిహద్దుల వద్ద మోహరించిన వేలాదిమంది రైతులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ముందుకు కదలడంతో వారిని ఆపేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. 
 
రైతులు భారీయెత్తున పొక్లెయినర్లు, బుల్ డోజర్లు, జేసీబీలతో ముందుకు కదులుతున్నారు. శంభు, ఖనౌరీ సరిహద్దుల వద్ద  14వేల మంది రైతులు 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో మోహరించారు. వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం వేలాదిమంది పోలీసులను రంగంలోకి దింపింది. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 
 
అయితే రైతులు ఇంకా భారీగా తరలివస్తుండటంతో వారిపై భాష్పవాయు గోళాలు ప్రయోగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆ మేరకు భాష్పవాయు గోళాలను సిద్ధంగా ఉంచుకున్నారు.  తమ డిమాండ్ల సాధన కోసం శంభు సరిహద్దులో బుల్డోజర్ లతో రైతులు నిరసన చేపట్టారు. కంచెలు తెంచేసి దేశ రాజధాని వైపు తరలివచ్చేందుకు పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నారు. 
 
ఈ వ్యవహారంపై హర్యానా పోలీసులు స్పందించారు. జేసీబీల యజమానులు, ఆపరేటర్లు దయచేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. భద్రతా దళాలకు హాని కలిగించడానికి ఈ యంత్రాలు ఉపయోగించడం తీవ్రమైన నేరమని, నాన్ బెయిలబుర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

ఈ క్రమంలో కేంద్ర సర్కారు రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా ఒక ప్రకటన చేశారు. రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరోసారి చర్చలకు రావాల్సిందిగా రైతులను ఆహ్వానిస్తున్నామని, కనీస మద్దతు ధర, పంట మార్పిడి, వ్యర్థాల దహనంపై రైతులతో చర్చకు సిద్ధమని ఆయన చెప్పారు.

అదేవిధంగా గత ఆందోళనల సందర్భంగా రైతులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఎత్తివేతపై చర్చిస్తామని అర్జున్‌ ముండా తెలిపారు. దేశంలో శాంతి నెలకొనాలంటే చర్చలు చాలా ముఖ్యమని అన్నారు. కాగా, తమ డిమాండ్‌లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని రైతులు అంటున్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తక్షణం తగు చర్యలు తీసుకోమని సూచిస్తూ పంజాబ్ ప్రభుత్వానికి అడ్వైజరీ జారీ చేసింది. రైతుల ముసుగులో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు చేరి రాళ్లు రావడం వంటి చర్యలకు పాల్పడవచ్చని హెచ్చరించింది. మరోవంక, బుల్‌డోజర్‌లు భద్రతకు ముప్పు కలిగిస్తున్నందున వాటిని స్వాధీనం చేసుకోవాలని హర్యానా పోలీసులు మంగళవారం పంజాబ్‌ అధికారులను కోరారు.

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు (ఎంఎస్‌పీ) చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తే రైతులు ఆందోళ‌న విర‌మిస్తార‌ని పంజాబ్ కిసాన్ మ‌జ్దూర్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌ర్వ‌న్ సింగ్ పాంథ‌ర్ బుధ‌వారం పున‌రుద్ఘాటించారు. రైతులంద‌రూ ఢిల్లీ ఛ‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లో ముందుకుసాగ‌ర‌ని, కేవ‌లం రైతు నాయ‌కులే దేశ రాజ‌ధానికి ప్ర‌ద‌ర్శ‌న‌గా త‌ర‌లివ‌స్తార‌ని చెప్పారు.  రైతులెవ‌రూ ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన‌బోర‌ని, రైతు నేత‌లే ముందుండి ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హిస్తార‌ని మ‌న సైనికుల‌పై తాము దాడి చేయ‌బోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. శాంతియుతంగా తాము ప్ర‌ద‌ర్శ‌న చేప‌డ‌తామ‌ని చెప్పారు.