న్యాయ కోవిదుడు ఫాలి నారిమన్ కన్నుమూత

భారత ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ (95) బుధవారం కన్నుమూశారు. ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. నారిమన్‌కు న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఫాలీ ఎస్ నారిమన్ నారిమన్ 1929 జనవరి 10న మయన్మార్ లోని పార్సీ కుటుంబంలో జన్మించారు.
38 ఏళ్ల వయసులో హైకోర్టు న్యాయమూర్తిగా ఉండటానికి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. నారిమన్ 1950లో మొదట బాంబే హైకోర్టు నుంచి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1961లో సీనియర్ అడ్వకేట్‌గా ఎంపికయ్యారు. 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్‌ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.
 
70 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1972లో సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. దీని తర్వాత ఆయన భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు.  నారిమన్ తన సుదీర్ఘ కెరీర్ లో దేశ చరిత్ర గతిని మలుపుతిప్పే పలు కేసుల్లో తన వాదనా పటిమతో మెప్పించారు. న్యాయ కోవిదుడిగా పేరు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగ చట్టం రూపకల్పనలోనూ నారిమన్‌ కీలక పాత్ర పోషించారు.

సుప్రీంకోర్టులో రాజ్యాంగ కేసుల నిపుణుడిగా పేరు తెచ్చుకున్న ఫాలీ ఎస్ నారిమన్.. న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఏసీ) కేసు, కొలీజియం ఏర్పాటుకు కారమైన ఏవోఆర్ కేసు సహా పలు కీలక పిటిషన్లలో వాదించారు. అలాగే పలు పౌర హక్కులు, లౌకిక వాద కేసులనూ వాదించిన చరిత్ర ఆయనకు ఉంది. 1975లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి నిరసనగా తన అదనపు సొలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా కూడా చేశారు.

ఇక.. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసులో యూనియన్‌ కార్బైడ్‌ కంపెనీ తరఫున వాదించారు నారిమన్‌. అయితే అది పొరపాటని తర్వాత ఇంటర్వ్యూలలో ఆయన పేర్కొన్నారు. గోలఖ్‌నాథ్‌, ఎస్పీ గుప్తా, టీఎంఏ పై ఫౌండేషన్‌ లాంటి కేసుల్ని ఆయన వాదించారు. సుప్రీం కోర్టు ఏవోఆర్‌ కేసును సైతం (ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీంకోర్టు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి..) ఈయనే వాదించారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపైనా నారిమన్ తీవ్ర విమర్శలు చేశారు. నారిమన్ కుమారుడు రోహింటన్ నారిమన్ సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా. నారిమన్ ఆత్మకథ “బిఫోర్ మెమరీ ఫేడ్స్” న్యాయ విద్యార్ధులందరికీ కరదీపిక. ముఖ్యంగా న్యాయ విద్యార్థులు, యువ న్యాయవాదులలో ఇది ఎంతో ప్రేరణ నింపిందని చెప్పుకుంటారు. “ది స్టేట్ ఆఫ్ నేషన్”, “గాడ్ సేవ్ ది హానబుల్ సుప్రీం కోర్ట్” వంటి పుస్తకాలను కూడా ఆయన రాశారు.
 
నారిమన్ తన విశేష కృషికి జనవరి 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు.  నారిమన్‌ సీనియర్ న్యాయవాదితో పాటు, 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో పాటు అతను అంతర్జాతీయ స్థాయిలో కూడా పనిచేశారు. 
నారిమన్ 1989 నుంచి 2005 వరకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వైస్-ఛైర్మెన్‌గా ఉన్నారు. ఆయన 1995 నుంచి 1997 వరకు జెనీవాలోని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.