నేటి నుంచి మేడారం మహా జాతర

* 12వ శతాబ్ధానికి చెందిన సమ్మక్క–సారలమ్మ * 24న రాష్ట్రపతి రాక 
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. మంగళవారం మేడారం మహాజాతర జంపన్న గద్దెకు చేరే క్రతువుతో జాతర ఆరంభమైంది.
 
ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ సాయంత్రం 4 గంటలకు గద్దెపై కొలువు దీరనుంది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని గద్దెలపైకి తొడ్కొని రానున్నారు. ఇక ఫిబ్రవరి 22న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. ఫిబ్రవరి 23న గద్దెలపై కొలువుదీరని తల్లులకు పూజలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 24న దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి.
ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ 
 
మేడారం మహాజాతర సందర్బంగా ప్రధాని మోదీ ట్వీట్ చేసి భక్తులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భాంగా ప్రధాని మోదీ తెలుగులో ఈ మహాజాతర గురించి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం’ అని ట్వీట్ చేశారు.

మేడారంలో ఇప్పటికే లక్షలాది మంది మొక్కులు సమర్పించి వెళ్లగా నాలుగు రోజుల్లోనే కోటిన్నర మంది వరకు భక్తులు మొక్కులు సమర్పిస్తారని అంచనా. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు సమర్పించుకోడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి రానున్నారు. చరిత్రకారులు, చరిత్ర పరిశోధకులు చెబుతున్న ప్రకారం సమ్మక్క–సారలమ్మ 12వ శతాబ్ధానికి చెందినవారు. దాదాపు 800 ఏళ్ల కిందట కాకతీయుల చేతిలో పోరాడిన ధీరవనితలుగా వారిద్దరూ గుర్తింపు పొందారు.

సమ్మక్క పుట్టుకకు సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉండగా, అందులో ఒక కథ ప్రకారం.. 12వ శతాబ్ధంలో ప్రస్తుత కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. సమ్మక్క–పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లలు పుట్టారు.

అప్పటికే ఓరుగల్లు సామ్రాజ్యాన్ని ఏలుతున్న కాకతీయుల రాజైన ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కాంక్షతో పొలవాసపై దండెత్తాడు. దీంతో మేడరాజు మేడారం పారిపోతాడు. మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేక పోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు రగిలిస్తూ రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్ద రాజును అణచివేసేందుకు ప్రతాపరుద్రుడు పథకం రచిస్తాడు.

ఈ మేరకు తన ప్రధాన మంత్రి యుగంధరుడితో కలిసి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. ఈ పోరులో కాకతీయులు చేసిన దాడిలో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా మారింది.

ఇక శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క చిలుకలగుట్ట వైపు వెళుతూ మార్గ మధ్యలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన ఆమె అనుచరులకు జాడ మాత్రం కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర కుంకుమ భరణి లభించగా దానినే అందరూ సమ్మక్కగా భావించారు.

నివాళులర్పించే కార్యక్రమమే!

దాదాపు 800 ఏళ్ల కిందట కాకతీయులతో తలపడిన సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న, నాగులమ్మ అందరూ మనుషులే. రాజ్య ప్రజల కోసం కాకతీయులను ఎదురించి, కాకతీయులు చేసిన దండయాత్రలో వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో సమ్మక్క–సారలమ్మ కాకతీయులతో వీరోచిత పోరాటం చేసి, ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించగా, ధీరవనితల వీరత్వాన్ని ఇక్కడి ప్రజలు దైవత్వంగా భావించారు. 

ప్రజల కోసం వారు చేసిన పోరాటమే వారిని దేవతలుగా మార్చగా, మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా సమ్మక్క–సారలమ్మను స్మరించుకుంటూ గిరిజనులంతా కలిసి నివాళులర్పించేవారు. అందుకే సమ్మక్క జాతరలో వేద మంత్రోచ్చరణలు ఉండవు. విగ్రహ ఆరాధనలు కూడా కనిపించవు. గద్దెలపై కంకవనం, కుంకుమ భరిణెలనే సమ్మక్క–సారలమ్మగా భావించి, గిరిజన సంప్రదాయ ప్రకారం వారికి పూజలు చేసేవారు. ఇలా నివాళులు అర్పించే కార్యక్రమమే కాలక్రమేణా జాతరగా మారినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

సమ్మక్క–సారలమ్మ గిరిజన బిడ్డలు కాగా, వారికి చిలుకలగుట్ట మీదనే నివాళులర్పించే కార్యక్రమాన్ని గిరిజనులు జాతరగా నిర్వహించడం ప్రారంభించారు. 1930 కాలం వరకు ఈ జాతరను కేవలం గిరిజనులు మాత్రమే నిర్వహించు కునేవారు. ఆ తరువాతి కాలంలో గిరిజనులు దైవంగా భావించిన సమ్మక్క–సారలమ్మ జాతరకు మేడారం చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కొంతమంది గిరిజనులు తరలివచ్చేవారు.

కాలక్రమేణా ఈ సంప్రదాయం కాస్త అన్ని వర్గాలకు వ్యాపించి, కులమతాలకు అతీతంగా సమ్మక్క జాతరకు తరలి రావడం ప్రారంభించారు. జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో అక్కడ రద్దీ పెరిగిపోయింది. దీంతో చిలుకల గుట్ట కింద జాతర నిర్వహించడం మొదలుపెట్టారు.

ఈ మహా జాతరకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ సహా మరికొన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మహా జాతరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఫిబ్రవరి 23న రాష్ట్రపతి గద్దెలను దర్శించుకుంటారు. గవర్నర్‌ తమిళిసై సాందర రాజన్, సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే రోజు మేడారానికి వెళ్లనున్నారు.
 
పోలీసు శాఖ బందోబస్తు కోసం 14 వేల మందిని రంగంలోకి దింపింది. భక్తుల భద్రత కోసం 700 వరకు సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా.. రైల్వేశాఖ కూడా ప్రత్యేకంగా రైళ్లనునడుపుతోంది. హెలికాప్టర్‌లోనూ మేడారం వెళ్లేందుకు వీలు కల్పించారు. జాతరకు వచ్చే ప్రైవేటు వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించారు.