నిరసనలో ట్రాక్టర్‌ ట్రాలీలపై హైకోర్టు మందలింపు

రైతుల ఢిల్లీ చలో నిరసన కార్యక్రమంపై పంజాబ్‌- హర్యానా హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నిరసనకారులను హైకోర్టు మందలించింది. నిరసనలో ట్రాక్టర్‌ ట్రాలీలను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది. పైగా, మోటారు వాహనాల చట్ట నిబంధనల ప్రకారం ట్రాక్టర్ ట్రాలీలను హైవేలలో నడపడానికి వీల్లేదని హైకోర్టు ఆందోళన చేస్తున్న రైతులకు స్పష్టం చేసింది. 
 
ప్రాథమిక హక్కుల గురించే కాదు రాజ్యాంగ బాధ్యతలను కూడా పాటించాలని రైతులకు హైకోర్టు గుర్తు చేసింది. ట్రాక్టర్ ట్రాలీలలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వెళుతున్నారని రైతులనుద్దేశించి కోర్టు పేర్కొంది. ప్రాథమిక హక్కుల గురించి అందరివీ తెలుసని, అదే ప్రకారం కొన్ని రాజ్యాంగపరమైన విధులను కూడా ప్రతిఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంటుందని రైతుల నిరసనకు సంబంధించి దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు సూచించింది.
 
రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకుంటే ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. అదే సమయంలో రైతులను గుమిగూడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారని పంజాబ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఒక చోట గుమికూడకుండా చూడాలని పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వారికి(రైతులకు) నిరసన తెలిపే హక్కు ఉందని చెబుతూనే సహేతుకమైన ఆంక్షలను కూడా విధించాల్సిన అవసరం ఉంటుందని కోర్టు పేర్కొంది.
 
తుల రిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని కేంద్రం తరఫున న్యాయవాది తెలపడంతో ఆ రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలకు సంబంధించిన ఫలితం, స్టేటస్‌ రిపోర్టును తదుపరి విచారణ సమయంలో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య గురువారం మరోసారి సమావేశం ఏర్పాటు చేసినట్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సత్యపాల్‌ జైన్‌ హైకోర్టుకు తెలిపారు. కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రతివాదులందరూ స్టేటస్‌ రిపోర్ట్‌తో హాజరుకావాలని ఆదేశించింది.