గృహిణి సేవలను డబ్బు కోణంలో చూడొద్దు

ఇంటి పనులు చేసే గృహిణులను తీసిపారేసే వారికి సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు చెప్పింది. ఆమె సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని, ఆ మాటకొస్తే ఆమె సేవలు అమూల్యమైనవని పేర్కొంది. ఓ యాక్సిడెంట్‌ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది. 
 
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే 2006లో ఓ మహిళ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి బీమా లేకపోవడంతో ఆమెకు పరిహారం చెల్లించే బాధ్యత వాహన యజమానిపై పడింది. మృతురాలి భర్త, ఆమె మైనర్‌ కుమారుడికి రూ. 2.5 లక్షల పరిహారం ఇవ్వాలని మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. 
 
అయితే, ఆ మొత్తం సరిపోదంటూ బాధిత కుటుంబం ఉత్తరాఖండ్‌ హైకోర్టును ఆశ్రయించింది.  కేసును విచారించిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆమె గృహిణి కాబట్టి పరిహారం ఫిక్స్‌డ్‌గా ఉంటుందని, కనీస ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించడం సబబేనని స్పష్టం చేసింది.  హైకోర్టు తీర్పును బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. గృహిణి ఆదాయాన్ని రోజుకూలి కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది.  హైకోర్టు వ్యాఖ్యలను తాము అంగీకరించబోమని, గృహిణి సేవలకు విలువ కట్టలేమని పేర్కొంది. ఆరు వారాల్లోగా రూ. 6.5 లక్షల పరిహారం చెల్లించాలని వాహన యజమానిని ఆదేశించింది.
ఇంట్లో సంపాదించే వ్యక్తి పాత్ర ఎంతో, ఒకదాని తర్వాత ఒకటిగా ఇంటి పనులు చక్కబెట్టే గృహిణి పాత్ర కూడా అంతేనని, ఆమె విలువను తక్కువగా అంచనా వేయొద్దని సూచించింది.