సీఏఎఫ్ కమాండర్‌ను గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కమాండర్‌ స్థాయి అధికారిని అపహరించి దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ (సీఏఎఫ్‌) 4వ బెటాలియన్‌ కమాండర్‌ తిజౌరామ్‌ భూర్య ఆదివారం బీజాపూర్‌ జిల్లా కుట్రు పోలీస్‌స్టేషన్‌ పరిధి అటవీప్రాంతంలోని సీఏఎఫ్‌ క్యాంప్‌నకు 200 మీటర్ల దూరంలో తన సిబ్బందితో కలిసి వంట చెరుకు సేకరిస్తున్నాడు.
 
అప్పటికే కాపుగాసిన మావోయిస్టులు కమాండర్‌ తిజౌరామ్‌ భూర్యను అపహరించారు. గొడ్డలితో దాడి చేసి హతమార్చి అక్కడి నుంచి పారిపోయారు.
వెంటనే ఘటనాస్థలికి వచ్చిన జవాన్లు రక్తపు మడుగులో ఉన్న భూర్యను విగతజీవిగా గుర్తించారు. భూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. 
 
కమాండర్‌ హత్యను సీరియస్‌గా తీసుకున్న అక్కడి పోలీస్‌ ఉన్నతాధికారులు ఘటనా జరిగిన స్థలానికి భారీగా భద్రతా దళాలను పంపించారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హత్యకు గురైన కమాండర్‌ స్వగ్రామం నారాయణ్‌పూర్‌ జిల్లాలోని భానుప్రతాపపురం అని తెలుస్తోంది.
 
“భూర్యా బస్తర్‌లోని వివిధ ప్రాంతాల్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో భాగమైన అనుభవజ్ఞుడైన అధికారి . మావోయిస్టులు మిలీషియా సభ్యులు, వారు గ్రామంలోనే ఉండి పోలీసుల కదలికలపై సమాచారాన్ని సేకరిస్తారు’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు సీఏఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.