బిఆర్‌ఎస్‌తో పొత్తుండదు

పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితు ల్లో బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మెడ మీద తలకాయ లేని వాడు బిఆర్‌ఎస్, బిజెపి పొత్తు అని మాట్లాడుతారని మండిపడుతూ మూర్ఖుడు, దుర్మార్గుడు చేస్తున్న ప్రచారాన్ని తాము ఖాతరు చేయమని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ. అలాంటి నావకు సహకరించే ప్రసక్తే లేదు. మాకు ఒక్క ఎమ్మెల్యే సీటు వచ్చినప్పుడే బీఆర్‌ఎ్‌సతో కలవలేదు. ఇప్పుడెందుకు కలుస్తాం? కలవడానికి బీఆర్‌ఎస్‌ దగ్గర ఏముంది? తెలంగాణకు ఆ పార్టీ అవసరం ఉందా?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇదే తరహా ప్రచారం చేశారని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజలను బిఆర్‌ఎస్ పదేళ్లుగా మోసం చేసిందని, ఆపార్టీ తెలంగాణకు అవసరం లేదని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని, వారి మాదిరిగా తాము చీకటి రాజకీయాలు చేయమని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి, బిఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటాయని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై స్పష్టతనిస్తూ పార్టీ కార్యకర్తలు అలాంటి మాటలు నమ్మవద్దని సూచించారు. 

బీఆర్‌ఎ్‌సతో బీజేపీ పొత్తు అంటూ ఎవరైనా మాట్లాడితే రెండు చెంపలపై కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానాన్ని కూడా గెలుచుకుంటామని చెప్పారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో కనీసం 25 మంది కొత్తవారిని పార్టీలో చేర్చుకోవాలని జాతీ య అధ్యక్షుడు నడ్డా సూచించారని కిషన్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో తమ పార్టీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలను ఎన్నికల షెడ్యూల్ రాకముందే పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ప్రచార మాధ్యమాలు ద్వారా వస్తున్న సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దేశంలో వ్యా ప్తంగా బిజెపి 370 సీట్లు, ఎన్‌డిఏ కూటమి 400 సీట్లు గెల్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 
 
ఇదే సందర్భంగా ఇండియా కూటమిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ కూటమి రోజు రోజుకు ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని దీంతో ఆ కూటమి నుండి పలు పార్టీల నాయకులు బయటకు వస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. 
కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతులు చాలా మంది తమ పార్టీలో చేరేందుకు సిద్ధ్దంగా ఉన్నారని చెబుతూ వారిని సంకల్ప యాత్రలో చేర్చుకుంటామని వెల్లడించారు.