ఇక డిజిటల్ రూపంలో బిజెపి పక్ష పత్రిక `జనసందేశ్’

భారతీయ జనతా పార్టీ సుమారు మూడున్నర దశాబ్దాలుగా తెలుగులో ప్రచురిస్తున్న పక్షపత్రిక `జనసందేశ్’ను ఇక నుండి డిజిటల్ రూపంలో తీసుకొస్తున్నారు. ఇకపై www.bjpjanasandesh.org వెబ్ సైట్ లో జనసందేశ్ సంచికలను డిజిటల్ రూపంలో ప్రచురించనున్నారు. డిజిటల్ సంచికను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.

ముగ్గురు ఎంపీలతో జనసంఘ్ రూపంలో మొదలైన ప్రస్థానం కాలక్రమంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ పురోగతిలో పార్టీకి చెందిన ప్రచార సాధనాలు, పత్రికలు పోషించిన పాత్రను విస్మరించలేం. పార్టీ సిద్ధాంతాలను, పార్టీ నాయకుల ఆలోచన విధానాలను పార్టీ కార్యకర్తలకు చేరవేసి దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల నిర్మాణంలో పార్టీ పత్రికల పాత్ర కూడా విశేషమైనదని కిషన్ రెడ్డి చెప్పారు.

నేడు జర్నలిజం వ్యాపారమయంగా మారిన దురదృష్టకర పరిస్థితుల్లో వక్రీకరణలు, దురుద్దేశ్యాలు ఆపాదించడం, ఉన్నది తొక్కిపెట్టడం, లేనిది ఉన్నట్టు చూపెట్టడం, గోరంతలు కొండంతలు చేయడం వంటి వికృత పోకడలు పత్రికారంగంలో ప్రవేశించాయనడం ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో వాస్తవాలను వారికి చేరవేసేందుకు, సరైన సమయంలో సరైన సందేశాన్ని అందించేందుకు జాతీయ స్థాయిలో బిజెపి ‘‘కమల్ సందేశ్’’ రూపంలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పత్రికలను తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు.

తెలుగు పాఠకులకు, ఇక్కడి కార్యకర్తలకు పార్టీ సందేశాన్ని మరింత చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో నాడు ఉమ్మడి రాష్ట్రంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తెలుగులో “జనసందేశ్” పక్ష పత్రికను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. 1991 నవంబర్ 25న ప్రారంభమై, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, బిజెపి కార్యకర్తల కృషితో పాఠకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటూ మూడున్నర దశాబ్దాలుగా తన ప్రస్థానాన్ని నిరాటంకంగా కొనసాగించింది

‘‘జనసందేశ్’’. ఈ క్రమంలో, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, తాను మొదటిసారి పార్టీ అధ్యక్షుడైనప్పుడు బ్లాక్ అండ్ వైట్ టాబ్లాయిడ్ నుంచి కలర్ పేజీల మ్యాగజైన్ గా రూపాంతరం చేశామని గుర్తు చేశారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో దేశంలో డిజిటల్ విప్లవం తాలూకూ ఫలితాలు మూరుమూల పల్లెలకు సైతం చేరుతున్న ప్రస్తుత తరుణంలో ‘‘జనసందేశ్’’ పత్రికను కూడా డిజిటల్ రూపంలో తీసుకొస్తున్నామని ప్రకటించారు.