జూన్‌ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు

* ఏపీపై అల్పపీడనం ప్రభావం

జూన్‌ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్‌ 11వ తేదీలోపే రాష్ట్రానికి రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది రుతుపవనాలు మే నెలాఖారుకే కేరళను తాకనున్నట్లు అధికారులు వివరించారు.

ఆ తర్వాత కేరళ నుంచి ఏపీ లోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోకి జూన్‌ 5 నుంచి 8తేదీల మధ్యన ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఒకవేళ ఆలస్యమైనా జూన్‌ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని స్పష్టం చేసింది. గతేడాది రుతుపవనాలు కేరళకే జూన్‌ 11న వచ్చాయని, అందుకే తెలంగాణలో జూన్‌ 20 తర్వాతే రుతుపవనాలు విస్తరించాయని వివరించింది. ప్రస్తుతం మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది.

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మే 26 వరకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. మే 22న కుమురం భీమ్‌ మినహా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు రోజుల్లో ఈశాన్య దిశగా కదులుతుందని అంచనా వేస్తున్నారు.. శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, శనివారం సాయంత్రానికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది అంటున్నారు.ఈ వాయుగుండం తుఫాన్‌గా బలపడితే ఒమన్ సూచించిన రెమాల్‌గా పేరు పెడతారు. 

మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఈ నెల 25న ఈ తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని ఓ అంచనా ఉంది.  రాష్ట్రంపై దీని ప్రభావం పెద్దగా ఉండదని, ఒడిశాతో పాటుగా పశ్చిమబెంగాల్‌‌లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.