అయోధ్య బాలరాముడికి ఇక రోజూ గంట విశ్రాంతి

అయోధ్యలో బాలరాముడికి గత నెల 22న ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి బాలరాముణ్ని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాముడికి విశ్రాంతి అనేదే లేకుండా పోతోంది. రోజూ ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి పది గంటల వరకూ బాలరాముడు భక్తులకు దర్శనమిస్తున్నాడు.

తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆలయంలో అర్చనాది కార్యక్రమాలు మొదలవుతాయి. బాలరాముడికి మేలుకొలుపు పాడి, పంచామృత స్నానాదికాలు పూర్తి చేసేసరికి ఆరు గంటలవుతుంది. అప్పటినుంచీ భక్తుల రాక మొదలవుతుంది. రాత్రి పది గంటల తర్వాత స్వామివారికి పవళింపు సేవ వంటివి జరుగుతాయి. చివరకు బాలరాముడు పవళించే సరికి రాత్రి పన్నెండు గంటలవుతోంది.

ఈ నేపథ్యంలో స్వామివారు విశ్రాంతి అనేదే లేకుండా పదహారు గంటలు ఏకబిగిన భక్తులకు దర్శనమివ్వడం సముచితం కాదని అయోధ్య ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. బాల రాముడి వయసు ఐదేళ్లేనని, ఐదేళ్ల రాముణ్ని ఇంతగా శ్రమపెట్టడం సబబు కాదని తెలిపారు. 

అందువల్ల రోజూ ఒక గంట సేపు రాములవారికి విశ్రాంతిని ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12.30 గంటలనుంచి 1.30 వరకూ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి, బాలరాముడికి విశ్రాంతినివ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈ వేళలు శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు.

సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెంచింది. భక్తులు రాముడిని దర్శించుకునేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది. కాగా పవిత్రోత్సవానికి ముందు దర్శన సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఉండేది.