సింహాలకు సీత – అక్బర్ పేర్లపై వివాదం

పశ్చిమ బెంగాల్‌లో ఉన్న శిలిగుడి సఫారీ పార్క్‌లో సింహాలకు సీత, అక్బర్ అని పేర్లు పెట్టడంపై వివాదం నెలకొంది. దీంతో పశ్చిమ బెంగాల్‌ అటవీ శాఖ అధికారులపై హిందూ సంస్థ అయిన విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కోర్టును ఆశ్రయించింది. శిలిగుడి సఫారీ పార్క్‌లోకి కొత్తగా ఒక మగ సింహం, మరో ఆడ సింహాన్ని అధికారులు తీసుకువచ్చారని వీహెచ్‌పీ తెలిపింది.

అయితే అందులో ఆడ సింహానికి సీత అని, మగ సింహానికి అక్బర్ అని పేరు పెట్టారని ఆరోపించింది. పైగా ఆ రెండు సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో అధికారులు ఉంచారని కోర్టుకు తెలిపింది. ఇది హిందువుల మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడమేనని స్పష్టం చేసింది.  కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వీహెచ్‌పీ బెంగాల్ అటవీ శాఖ అధికారులు, బెంగాల్‌ సఫారీ పార్క్‌ డైరెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చింది.

ఈ మేరకు ఈ నెల 16 వ తేదీన కలకత్తా హైకోర్టులోని జల్పాయ్‌గురి సర్క్యూట్‌ బెంచ్‌ను వీహెచ్‌పీ ఆశ్రయించగా  ఆ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది. త్రిపుర రాష్ట్రంలోని సిపాహీజలా జులాజికల్‌ పార్క్‌ నుంచి పశ్చిమబెంగాల్‌ అధికారులు ఒక మగ, మరో ఆడ సింహాన్ని ఇటీవలె ఈ నెల 12 వ తేదీన శిలిగుడి సఫారీ పార్క్‌కు తీసుకొచ్చారు. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులే ఆ సింహాలకు ఆ పేర్లు పెట్టారని వీహెచ్‌పీ ఆరోపిస్తోంది.

జంతువుకు ఇలా సీత పేరు పెట్టడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొంది. వెంటనే సీత పేరు పెట్టిన ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్‌ చేస్తోంది. భవిష్యత్తులో ఏ జూలాజికల్ పార్క్‌లోని ఏ జంతువుకు ఏ మతానికి చెందిన దేవుళ్లు, దేవతల పేర్లు పెట్టకూడదని పిటిషన్‌లో వీహెచ్‌పీ తెలిపింది.

అయితే పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులు మాత్రం వీహెచ్‌పీ చేస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. త్రిపుర నుంచి తీసుకొచ్చిన సింహాలకు ఇంకా ఎలాంటి పేర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. అయితే బెంగాల్ అటవీ శాఖ మంత్రి బీర్బహ హన్సడా ఆ పేర్లను త్రిపుర జూ లోనే ఇచ్చారని చెబుతున్నారు.  జంతువుల మార్పిడిలో భాగంగా బెంగాలీ సఫారీ పార్క్‌కి ఐఎల్26, ఐఎల్27 అనే రెండు సింహాలను అధికారులు తీసుకువచ్చారు.