బెంగాల్ లో లైంగిక వేధింపుల ఘటనపై ఎన్‌సిడబ్ల్యు ఆగ్రహం

 
* కేంద్ర మంత్రి నేతృత్వంలో బిజెపి బృందం
 
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌సిడబ్ల్యు  బృందం గురువారం సందేశ్‌ఖాలీలో చూసిన ‘దయనీయమైన పరిస్థితుల’ను తీవ్రంగా ఖండించింది. పొలిసు అధికారులు, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కార్యకరతలు ‘విస్తృతమైన భయం,  క్రమబద్ధమైన దుర్వినియోగం’ వ్యాప్తి చేస్తున్నట్లు ఆరోపించింది. 
 
ఈ బృందం మహిళల నుండి కలవరపరిచే సాక్ష్యాలను సేకరించింది. అయితే, హింసాకాండ ప్రభావిత ప్రాంతమైన సందేశ్‌ఖాలీకి చెందిన వ్యక్తుల నుండి తమకు నాలుగు ఫిర్యాదులు మాత్రమే అందాయని పశ్చిమ బెంగాల్ పోలీసులు సోమవారం తెలిపారు. ఈ ఫిర్యాదులలో ఏదీ అత్యాచారం లేదా లైంగిక వేధింపుల సంఘటనలను ప్రస్తావించలేదని చెప్పారు.
 
 “దిగ్భ్రాంతికరంగా, మా బృందం దర్యాప్తు బెంగాల్ ప్రభుత్వం, చట్టాన్ని అమలు చేసే అధికారుల నిర్లక్ష్యం, సంక్లిష్టత  బాధాకరమైన నమూనాను వెల్లడించాయి” అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సందేశ్‌ఖాలీని సందర్శించిన సమయంలో స్థానిక పోలీసు అధికారులు ప్రదర్శించిన వైఖరిపై ఎన్‌సిడబ్ల్యు సభ్యురాలు డెలినా ఖోంగ్‌డుప్ ‘తీవ్రమైన దిగ్భ్రాంతి’ వ్యక్తం చేశారు.
 
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తమ బృందానికి సహకరించడానికి నిరాకరించారని, పోలీసు సూపరింటెండెంట్ బృందానికి ఎలాంటి ఎస్కార్ట్ లేదా సహాయం అందించడంలో విఫలమయ్యారని  ఎన్‌సిడబ్ల్యు పేర్కొంది.  పోలీసు అధికారులు టిఎంసి సభ్యులు ఇద్దరూ శారీరక, లైంగిక హింసకు పాల్పడిన సందర్భాలను బాధితులు వివరించారని  ఎన్‌సిడబ్ల్యు తెలిపింది.
 
 “ఇటువంటి దురాగతాలకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేసిన మహిళలు ఆస్తి జప్తు, మగ కుటుంబ సభ్యుల ఏకపక్ష అరెస్టులు, మరింత క్రూరమైన చర్యలతో సహా తక్షణ ప్రతీకారాన్ని ఎదుర్కొన్నారు” అని వెల్లడించింది. ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ వచ్చే వారంలో సందేశ్‌ఖాలీని స్వయంగా సందర్శించి, పోలీసులు,  బాధితులతో మాట్లాడతారని పశ్చిమ బెంగాల్‌లో మహిళల జీవితాలు, స్వేచ్ఛలను రక్షించేలా చూస్తారని తెలిపింద
 
“సమాజంలోని అత్యంత దుర్బలమైన సభ్యులను రక్షించడంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు విఫలమయ్యారని స్పష్టంగా తెలుస్తుంది.  ప్రభుత్వం నుండి అత్యున్నత స్థాయిలలో తక్షణ, సంఘటిత చర్య అవసరం” అని స్పష్టం చేసింది. . స్థానిక టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్, అతని “గ్యాంగ్” తమను “లైంగికంగా వేధించడం”తో పాటు, బలవంతంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని సందేశ్‌ఖాలీలోని పెద్ద సంఖ్యలో మహిళలు పేర్కొన్నారు.
 
రేషన్ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బృందం అతని ఇంటిపై దాడి చేయడానికి వెళ్లిన గుంపు దాడి చేయడంతో గత నెల నుండి పరారీలో ఉన్న షేక్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఎన్‌సిడబ్ల్యు డిమాండ్ చెడింది.
 
కేంద్ర మంత్రి నేతృత్వంలో బిజెపి బృందం
 
మరోవంక, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను బిజెపి ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి నేతృత్వం వహించనున్నారు.  విచారణ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలతో కూడిన నివేదికను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందించనుంది.  ప్రతిమా భౌమిక్, సునీతా దుగ్గల్, కవితా పటీదార్, సంగీత యాదవ్, బ్రిజ్‌లాల్ మిగతా సభ్యులుగా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని జేపీ నడ్డా ఆరోపించారు.  ఉత్తర 24 పరగణాల జిల్లా బసిర్‌హత్ సబ్‌డివిజన్‌లోని సందేశ్‌ఖలీలో సుకాంత మజుందార్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో మజుందార్‌కు గాయాలయ్యాయి.
 
తృణమూల్ కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు బాధితులైన మహిళలను పరామర్శించడానికి బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు బుధవారం గెస్ట్‌హౌస్ నుంచి సందేశ్ ఖాలీకి బయలుదేరారు. సందేశ్ కాలీలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున వీరిని పోలీస్‌లు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. 
 
ఈ ఘర్షణలో సుకాంత మజుందార్ స్పృహ తప్పి పడిపోయ గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కోల్‌కత్తాకు తరలించారు. సుందర్‌బన్స్లో చిన్న ద్వీపం సందేశ్‌ఖలి. బంగ్లాదేశ సరిహద్దుకు అతి సమీపంలో ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. 
 
మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు తీవ్రమయ్యాయంటూ స్థానిక మహిళలు ఆరోపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తీవ్ర కలకలం రేపింది. స్థానికంగా ఉండే టీఎంసీ నేత నచ్చిన వారిని పార్టీ ఆఫీసుకు తీసుకెళ్తారని, రాత్రంతా అక్కడే ఉంచి, ఉదయం ఇంటికి పంపిస్తారంటూ ఓ మహిళ ఏడుస్తూ చెప్పే దృశ్యాలు ప్రకంపనలు సృష్టించాయి. 
 
ఈ ఆరోపణల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షేక్ షాజహాన్. ఆయన ఒక స్థానిక జిల్లా పరిషత్ సభ్యుడు.  అత్యాచారాలు, లైంగిక దాడులే కాకుండా తమ భూములు సైతం లాగేసుకున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. తాజా పరిణామాలతో పశ్చిమ బెంగాల్ లో రాజకీయ దుమారం చెలరేగింది.
 
17 మందిని అరెస్ట్ చేసాం
కాగా, ఈ ఘటనలో ఇప్పటికి 17 మందిని అరెస్ట్ చేసిన్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర శాసనసభలో చెప్పారు. స్థానిక టిఎంసి సభ్యులే లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నరని చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ తాను ఎవ్వరికీ ఎటువంటి అన్యాయం జరగబోనీయనని స్పష్టం చేశారు. అక్కడకు రాష్ట్ర మహిళా కమిషన్ ను పంపించానని, ఓ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశానని ఆమె చెప్పారు.