పేటీఎంపై దర్యాప్తు ప్రారంభించిన ఈడీ 

బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)దర్యాప్తు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బుధవారం ముందుగా ఆర్బీఐ నుంచి మరింత సమాచారం కోరిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.  అయితే ఈ పరిణామాన్ని పేటీఎం ధృవీకరించలేదు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంక్‌ డిపాజిట్లు తీసుకోరాదని, కస్టమర్‌ ఖాతాలు, వ్యాలెట్లలో టాప్‌ అప్స్‌. ఫాస్ట్‌ట్యాగ్స్‌, ప్రిపెయిడ్‌ సాధనాలు ఇవ్వరాదంటూ జనవరి 31న ఆర్బీఐ నిషేధ చర్యల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలాగే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై తాము ప్రకటించిన చర్యల్ని సమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ రెండు రోజుల క్రితమే స్పష్టం చేసినదీ విదితమే.  ఆర్బీఐ జనవరి 31న నిషేధ చర్యల్ని ప్రకటించిన తర్వాత 55 శాతం మేర మార్కెట్‌ విలువను కోల్పోయిన పేటీఎం మాతృసంస్థ వ‌న్‌ 97 కమ్యూనికేషన్స్‌ షేరు బుధవారం మరో 10 శాతం పతనమై ఆల్‌టైమ్‌ కనిష్ఠస్థాయి రూ.343 వద్దకు పడిపోయింది.

విదేశాలకు నగదు బదిలీకి సంబంధించిన ఫారిన్‌ ఎక్సేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా)ను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే ఫారెక్స్‌ ఉల్లంఘనలకు పాల్పడలేదని ఇప్పటికే సంస్థ ఖండించినప్పటికీ, దర్యాప్తులో భాగంగా ఆర్బీఐ నుంచి మరిన్ని వివరాలను తెలుసుకుంటున్నది.

మరోవంక, ఇటీవల పలు ఫిన్‌టెక్ కంపెనీలపై చర్యలు తీసుకుంటున్న ఆర్‌బీఐ తాజాగా వీసా, మాస్టర్ కార్డు వంటి కార్డులతో వ్యాపార/వాణిజ్య చెల్లింపుల్ని నిలిపి వేయాలని ఆదేశించింది. మాస్టర్ కార్డ్, వీసా అనేవి విలువ పరంగా కార్డు చెల్లింపుల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఫిబ్రవరి 8న ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ నోటీసు వచ్చే వరకు బిజినెస్ పేమెంట్స్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అన్ని ట్రాన్సాక్షన్లను నిలిపివేయాలని కోరింది ఆర్బీఐ.

ఈ కార్డుల్ని ఉపయోగించి కేవైసీ చేయని వ్యాపారాలకు కూడా చెల్లింపులు జరుగుతున్నట్లు తెలిసింది. అందుకే ఈ ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఆంక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి లావాదేవీల్లో మోసాలు, మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తోంది.