నాలుగో స్థానానికి జపాన్ ఆర్థిక వ్యవస్థ పతనం

* ఆర్థిక మాంద్యంలోకి బ్రిటన్‌ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానం జపాన్‌దే. అయితే తాజాగా జపాన్‌ నాలుగో స్థానానికి పడిపోయింది. గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదైంది. గతేడాది జపాన్‌ నామమాత్రపు జీడీపీ 4.2 ట్రిలియన్‌ డాలర్లు కాగా, అదే సమయంలో మూడో స్థానంలో ఉన్న జర్మనీ 4.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఎదిగింది.

అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు జపాన్‌ వాస్తవిక జీడీపీ వృద్ధిని చూస్తే సంవత్సరానికి 0.4 శాతం తగ్గుదల కనిపించింది. మూడు నెలల వారీగా చూస్తే 0.1 శాతం క్షీణించింది. తాజా ధరలతో నామమాత్రపు జీడీపీని లెక్కిస్తుండగా స్థిర ధరల ఆధారంగా వాస్తవిక జీడీపీని లెక్కిస్తారు. జపాన్‌లో ఎందుకింత క్షీణత కనిపిస్తుందన్న దాన్ని విశ్లేషిస్తే దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవటం, పిల్లల సంఖ్య బాగా తగ్గిపోవటం వల్ల ఉత్పాదకతలో తగ్గుదల ఏర్పడింది.

పోటీతత్వాన్ని కూడా జపాన్‌ క్రమేపీ కోల్పోసాగిందని అర్థమవుతున్నది.  తాజాగా వెలువడిన గణాంకాలు కూడా ఈ విషయాన్నే ప్రతిబింబిస్తున్నాయి. అణు దాడుల్లో సర్వనాశనమైన దశ నుంచి కసిగా ఎదిగిన జపాన్‌ సుమారు రెండు దశాబ్దాల పాటు ఆర్థిక వ్యవస్థలో నంబర్‌ 2 స్థానాన్ని నిలబెట్టుకున్నది. 2010లో చైనా విజృంభించి జపాన్‌ను మూడో స్థానానికి నెట్టేసింది.

మరోవంక, బ్రిటన్ క్రమంగా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనబోతున్నది. 2023 చివరి త్రైమాసికం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. ఈ మూడు నెలల్లో యూకే జీడీపీ 0.3 శాతం తగ్గినట్టు బ్రిటన్‌ జాతీయ గణాంక శాఖ తెలిపింది. ఈ పరిస్థితికి పారిశ్రామిక ఉత్పత్తి, నిర్మాణ రంగం, సేవల్లో స్తబ్ధత ఏర్పడటమే కారణమని విశ్లేషిస్తున్నారు.

ఆర్థిక వేత్తలు అంచనా వేసినట్టుగా జీడీపీ క్షీణత 01 శాతం కన్నా ఎక్కువగా నమోదు కావటం గమనార్హం. వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ నెమ్మదిస్తే దాన్ని మాంద్యంగా పేర్కొంటారు. బ్రిటన్‌ జీడీపి అంతకుముందు త్రైమాసికంలో కూడా 0.1 శాతం తగ్గింది. చివరి త్రైమాసికంలో కూడా తగ్గుదల నమోదైంది. 2020లో ఒకసారి ఇలాగే బ్రిటన్‌ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది.

ఇప్పుడు అదే పునరావృతం అయ్యింది. బ్రిటన్‌ అధికార పార్టీ అయిన కన్సర్వేటివ్‌ పార్టీపై ఆర్థిక మాంద్యం పెద్ద ప్రభావాన్నే చూపనున్నది. ఈ సంవత్సరంలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల తేదీ ఇంకా నిర్ణయించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రుషి సునాక్‌కు ఇది నిజంగా ఇబ్బంది కలిగించే అంశమే.