మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్

తీవ్ర అస్వస్థతతో ఈనెల 10న కోల్‌కతాలోని  ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేరిన సీనియ‌ర్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఆరోగ్య పరిస్ధితి మెరుగుప‌డ‌టంతో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న‌ను డిశ్చార్జి చేశారు. త‌న ఆరోగ్యం బాగుంద‌ని త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్‌ల్లో తిరిగి పాల్గొంటాన‌ని మిథున్ చ‌క్ర‌వ‌ర్తి వెల్ల‌డించారు.

మెదడుకు సంబంధించిన ”ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్‌”తో ఆయన ఆసుపత్రిలో చేరారు  మిథున్‌కు ఎంఆర్ఐ స‌హా ప‌లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు మెరుగైన చికిత్స అందించ‌డంతో ఆయ‌న కోలుకున్నారు. త‌న‌కు తీవ్ర ఆరోగ్య స‌మ‌స్య‌లేమీ లేవ‌ని, జీవ‌న‌శైలితో పాటు ఆహార అల‌వాట్లు మార్చుకుంటే స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని మిథున్ చ‌క్ర‌వ‌ర్తి పేర్కొన్నారు.

”ఒక దెయ్యంలా తినేవాడిని. అందుకు శిక్ష అనుభవించాను. ప్రతి ఒక్కరూ మితాహారం తీసుకోవాలనేది నా సలహా. మధుమేహం ఉన్నవారు స్వీట్లు తింటే ఏమీ కాదనే అపోహలో ఉండొద్దు. డయిట్ కంట్రోల్ ఉండాల్సిందే” అని మిధున్ స్పష్టం చేశారు.

పశ్చిమబెంగాల్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై అడిగినప్పుడు, 42 లోక్‌సభ నియోజవర్గాల్లోనూ బీజేపీ తరఫున చురుకుగా పనిచేస్తానని చెప్పారు. పార్టీ కోరితే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారానికి వెళ్తానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, బీజేపీ అఖండ విజయాలను సొంతం చేసుకునేందుకు ఇదే తగిన సమయమని మిథున్ చక్రవర్తి చెప్పారు.

తాను మంగళవారం నుంచే షూటింగ్‌ల్లో పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం త‌న‌కు ఫోన్ చేసి మాట్లాడార‌ని ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాల‌ని మంద‌లించార‌ని తెలిపారు.  కాగా, తన తండ్రి ఇప్పుడు చక్కటి ఆరోగ్యంతో ఉన్నారని, ఆయన కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని మిధున్ చక్రవర్తి కుమారుడు నమషి చక్రవర్తి ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.

మిధున్ చక్రవర్తికి ఇటీవల భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసింది. ఇటీవల ‘కాబూలీవాలా’ అనే చిత్రంలో మిథున్ చక్రవర్తి వెండితెరపై కనిపించారు. మిథున్ చ‌క్ర‌వ‌ర్తి హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్‌పురి, త‌మిళ్ స‌హా ప‌లు భాష‌ల్లో దాదాపు 350 సినిమాల్లో న‌టించారు.