![బలపరీక్ష నెగ్గిన నితీశ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గిన నితీశ్ ప్రభుత్వం](https://nijamtoday.com/wp-content/uploads/2024/02/Nitish-1024x576.jpg)
* ఆర్జేడీ ఎమ్మె్ల్యేల క్రాస్ ఓటింగ్
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. తన బలం నిరూపించుకుని అధికారాన్ని నిలబెట్టుకున్నారు. మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం కొనసాగాలంటే నితీశ్ కుమార్‌కు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా సోమవారం నిర్వహించిన విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.
ఓటింగ్ సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఇక ఈ ఓటింగ్‌లో ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడం సంచలనంగా మారింది. ఇటీవలె మహాఘట్‌బంధన్ నుంచి విడిపోయిన నితీశ్ కుమార్ బీజేపీతో జట్టుకట్టారు.
ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై విశ్వాసం కోరుతూ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటుచేసుకుంది. మరోవైపు, ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు చేతన్ ఆనంద్, నీలం దేవి, ప్రహ్లాద్ యాదవ్ అసెంబ్లీలో తమ పార్టీ నేతల వైపు కాకుండా ప్రభుత్వ పక్షం వైపు కూర్చున్నారు.
విశ్వాస పరీక్ష సందర్భంగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు కూర్చోవడంపై మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటింగ్ ముగిసే వరకు ఎమ్మెల్యేలు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని, లేకుంటే ఓటు చెల్లుబాటు కాదని తెలిపారు. ఈ క్రమంలోనే ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆర్జేడీ-జేడీయూ కూటమిలో చేరడం ప్రతిపక్ష మహాఘటబంధన్ కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
అంతకుముందు అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి, ఆయనను స్పీకర్ స్థానం నుంచి తొలగించిన తర్వాత ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. నితీష్ కుమార్ ఈ సందర్భంగా విపక్ష ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. తాను ఇండియా కూటమిలో ఉండటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని చెబుతూ విపక్ష కూటమి కోసం తాను ఎంతో కష్టపడ్డానని, విపక్షాలను ఏకం చేస్తుంటే తనను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని చెబుతూ విపక్ష కూటమికి తాను నాయకత్వం వహించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. ‘బీహారి అయిన కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న పురస్కారం దక్కడంపై నేను సంతోషంగా ఉన్నా. కానీ బీజేపీ సర్కారు భారత రత్నను ఒక ఒప్పందంలా మార్చేసింది. మీరు మాతో డీల్ కుదుర్చుకుంటే మేం మీకు భారత రత్న ఇస్తాం అన్నట్లు వ్యవహరిస్తోంది’ అని అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తేజస్వి యాదవ్ విమర్శించారు.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్‌పై వ్యాఖ్యలు
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
బంగ్లాదేశ్ లో కంగనా ‘ఎమర్జెన్సీ’ పై నిషేధం