అవిశ్వాస తీర్మానంతో బీహార్ స్పీకర్ తొలగింపు

బీహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైంది. సోమవారం బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యారు. తొలుత గవర్నర్ ప్రసంగం అనంతరం ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవథ్ బిహారీ చౌదరిపై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు వ్యతిరేకంగా 112 ఓట్లు పడటంతో స్పీకర్‌ను తొలగించారు.
 
 అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అవధ్‌ బిహారీ తన పదవిని కోల్పోయారు.  ఆర్జేడీ, కాంగ్రెస్‌, జేడీయూలతో కూడిన మహా కూటమి సర్కారులో అవధ్‌ బిహారీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల సీఎం నితీశ్‌కుమార్‌ మహాకూటమికి గుడ్‌బై చెప్పి.. ఎన్డీఏలో చేరి, ఎన్డీఏ తరఫున సీఎంగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. 
 
అయితే స్పీకర్‌ అవధ్‌ బిహారీ తన పదవికి రాజీనామా చేయలేదు.  ఆర్జేడీతో తెగతెంపులు కారణంగా ఆ పార్టీకి చెందిన చౌదరి స్పీకర్‌ను పదవి నుంచి తప్పుకోవాల ఎన్డీయే సర్కార్ కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. దీంతో సోమవారంనాడు సభలో ఆయనపై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానం గెలవడంతో స్పీకర్‌ తప్పుకున్నారు.ప్రస్తుతం నితీశ్‌ సర్కారు పెట్టిన విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన ఓటింగ్‌ను బట్టి.. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే నితీశ్‌ సర్కారు సునాయాసంగా ఇవాళ్టి బలపరీక్షలో నెగ్గే అవకాశం ఉంది.