బీజేపీ 14 మందితో రాజ్య‌స‌భ అభ్య‌ర్ధుల జాబితా

ఫిబ్రవ‌రి 27న జ‌రిగే రాజ్య‌సభ ఎన్నిక‌ల‌కు బీజేపీ ఆదివారం 14 మంది అభ్య‌ర్ధుల జాబితాను ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ నుంచి 2022లో బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్‌ తో పాటు ప్రస్తుత సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేదిని యూపీ నుంచి నామినేట్ చేసింది. ఇక యూపీ నుంచి రాజ్య‌స‌భ బ‌రిలో నిలిచే అభ్య‌ర్ధుల్లో  చౌధ‌రి తేజ్వీర్ సింగ్‌, సాధ‌నా సింగ్‌, అమ్ర‌పాల్ మౌర్య‌, సంగీత బ‌ల్వంత్‌, నవీన్ జైన్ ఉన్నారు.
 
కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యునిగా ఉన్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ప్రస్తుతం ఉత్తరాఖండ్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఉన్న పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి, మీడియా విభాగం అధిపతి అనిల్ బాలునిలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. వారిద్దరిని లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయించే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ ఆ రాష్ట్రం నుండి అభ్యర్థిగా ప్రకటించారు.

ఇక బిహార్ నుంచి నితీష్ కుమార్‌తో పొత్తులో ఉండ‌గా ఆ రాష్ట్రం నుంచి ధ‌ర్మశీల గుప్తా, భీమ్ సింగ్‌ల‌ను పార్టీ అభ్య‌ర్ధులుగా బ‌రిలో నిలిపింది. బిహార్ నుంచి ప్ర‌ముఖ నేత సుశీల్ కుమార్ మోదీ పేరు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

చ‌త్తీస్‌ఘ‌ఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్ర‌తాప్ సింగ్ పేరును ప్ర‌క‌టించ‌గా, హ‌రియాణ నుంచి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుభాష్ బ‌రాలా, క‌ర్నాట‌క నుంచి నారాయ‌ణ కృష్ణ‌న‌స భంద‌గే బ‌రిలో నిలుస్తారు. బెంగాల్ నుంచి సామిక్ భ‌ట్టాచార్య‌ను పెద్ద‌ల స‌భ‌కు పంపాల‌ని బీజేపీ నిర్ణ‌యించింది. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న కేంద్ర మంత్రులు ఎవ్వరూ ఈ జాబితాలో లేకపోవడంతో వారిలో చాలామందిని లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.