బీజేపీలో చేరిన మాజీ సీఎం అశోక్ చ‌వాన్‌

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మ‌హారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చ‌వాన్ మంగ‌ళ‌వారం బీజేపీలో చేరారు. ముంబైలోని బీజేపీ కార్యాల‌యంలో ఆ పార్టీలో చేరుతున్నాన‌ని అంత‌కుముందు ఆయ‌న వెల్ల‌డించారు. ఈరోజు త‌న నూత‌న రాజ‌కీయ అధ్యాయం ప్రారంభం కానుంద‌ని తెలిపారు.
కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియా గాందీ, రాహుల్ గాంధీలు మీతో ఫోన్‌లో ఏమైనా సంప్ర‌దింపులు జ‌రిపారా అని ప్ర‌శ్నించ‌గా స‌మాధానాన్ని అశోక్ చ‌వాన్ దాట‌వేశారు. త‌న‌తో క‌లిసి బీజేపీలో చేరాల్సిందిగా తాను కాంగ్రెస్ నాయకులు, కార్య‌క‌ర్త‌ల‌ను తాను కోర‌లేద‌ని చెప్పారు.

బీజేపీలో అశోక్ చ‌వాన్ చేరిక‌ను మ‌హారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ స్వాగ‌తించారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం క‌లిగిన చ‌వాన్ బీజేపీలో చేర‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని చెబుతూ దిగ్గ‌జ నేత కాషాయ పార్టీలోకి రావ‌డం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు.

కాగా, అశోక్ చవాన్‌ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అమిత్ దేశ్ ముఖ్, ధీరజ్ దేశ్ ముఖ్, జితేష్, కునాల్ పాటిల్, సంగ్రామ్, మాధవ రావు, విశ్వజిత్ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది.