రైతులపై కేసుల ఉపసంహరణ!

పంటలకు కనీస మద్దతు ధరపై చట్ట చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో పాటుగా తమ డిమాండ్ల సాధనకు ‘చలో ఢిల్లీ’ యాత్రకు సిద్ధమైన రైతులను యాత్రను విరమించుకునేలా చేసే చివరి ప్రయత్నంలో భాగంగా కేంద్ర మంత్రుల బృందం సోమవారం సాయంత్రం రైతు నేతలతో చర్చలు జరిపింది. 

కేంద్ర, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా చండీగఢ్ సెక్టార్ 26లో ఉన్న మహాత్మా గాంధీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో రైతు నేతలతో రెండో దఫా చర్చలు జరిపారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి పొద్దుపోయాదాకా కొనసాగింది. 

చర్చల్లో సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వాన్ సింగ్ పంధేర్‌తో పాటుగా వివిధ రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.  పంజాబ్ కేబినెట్ మంత్రి కుల్దీప్ సింగ్ ధలీవాల్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనురాగ్ వర్మ, డిజిపి గౌరవ్ యాదవ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 

2020- 21లో కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేసిన సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడానికి మంత్రుల బృందం చర్చల సందర్భంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత ఆందోళన సందర్భంగా చనిపోయిన రైతుల కుటుంబాల్లో ఎవరికైనా పరిహారం చెల్లించకుండా ఉంటే వారికి కూడా పరిహారం చెల్లించడానికి కూడా మంత్రులు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

అంతేకాకుండా రైతుల ఇతర డిమాండ్లపై కూడా సమావేశంలో కేంద్ర మంత్రులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుందని చర్చల్లో పాల్గొన్న పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ ధలీవాల్ చెప్పారు. రైతు నేతలతో కేంద మంత్రులు చర్చలు జరపడం ఇది రెండో సారి. ఈ నెల 8న జరిగిన తొలి విడత చర్చల సందర్భంగా వివిధ రైతు సంఘాల నేతలతో మంత్రులు వారి డిమాండ్లపై లోతుగా చర్చించారు.

కాగా, చర్చలు ఫలించలేదని చెబుతూ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి తమ నిరసన కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్రం ఇప్పటికే కేంద్ర బలగాలను రంగంలోకి దించింది.  ఢిల్లీలో ఏకంగా నెల రోజులపాటు 144 సెక్షన్‌ విధిస్తున్నట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్‌ సంజయ్‌ అరోరా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

అత్యవసరమయితే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రజలు ప్రయాణించవద్దని సూచించారు. ఇక, ఢిల్లీ సరిహద్దు రహదారులన్నింటినీ భారీ కేడ్లు, ముళ్ల కంచెలతో మూసివేసింది. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను సైతం మోహరించారు. రాఫ్ దళాలతో సహా మూడంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు. 

రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు సింఘూ, టిక్రి, ఘాజీపూర్‌ సరిహద్దుల ప్రవేశ పాయింట్ల వద్ద సిమెంట్‌ బారికేడ్లు, ఇనుప కంచెలు, మేకులు, కంటెయినర్లతో బహుళ అంచెల బారికేడ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు పరిస్థితిని సమీక్షించేందుకు సింఘూ సరిహద్దు వద్ద ఒక తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. హర్యానాతో సరిహద్దులు పంచుకొనే గ్రామీణ రహదారులను మూసివేశారు. 

ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. పంజాబ్‌ సరిహద్దుల్లోని అంబాలా, జింద్‌, ఫతేబాద్‌, కురుక్షేత్ర, సిర్సా జిల్లాల్లో బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేసింది. కర్ణాటక నుంచి వస్తున్న దాదాపు 100 మంది రైతులను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.