ఖతార్ లో భారత మాజీ నేవీ అధికారుల విడుదల  

భారత్ దౌత్యపరంగా సాధించిన ఘనవిజయంకు సూచికగా గూఢచర్యం ఆరోపణలపై గతంలో అరెస్ట్ అయి, కోర్టు మరణ శిక్ష విధించిన  ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళ అధికారులు జైలు నుండి విడుదల కావడమే కాకుండా, వారిలో ఏడుగురు సోమవారం తెల్లవారుజామున భారత్ కు తిరిగి వచ్చారు.  జైల్లో మగ్గుతున్న ఎనిమిది మందిని కూడా ఖతార్ కోర్టు విడుదల చేసింది.
దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న 8 మంది భారత మాజీ నౌకదళ అధికారులను గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై 2022 అక్టోబర్ లో ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. తర్వాత వీరికి ఖతార్ కోర్డు మరణశిక్ష కూడా విధించింది. ఈ క్రమంలో వారిని రక్షించమని కోరుతూ అధికారుల కుటుంబ సభ్యులు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దీంతో రంగంలోకి దిగిన భారత్ చట్టపరమైన చర్యలు చేపట్టి వారిని విడిపించేందుకు ఖతార్ కోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ క్రమంలో ఖతార్ కోర్టు వారికి విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ జీవిత ఖైదు విధించింది.  అయితే, ఇంకా కోర్టు వివరణాత్మక తీర్పు అందవలసి ఉండగా భారత విదేశాంగ అధికారులు  ఖతార్‌లోని న్యాయ బృందం, ఖైదీల కుటుంబాలతో సన్నిహిత సంబంధంలో ఉన్నారు.
ఖతార్ ఎమిర్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన సమావేశంలో ద్వైపాక్షిక సహకారం, ఖతార్‌లోని భారతీయ సమాజ సంక్షేమం గురించి ప్రస్తావించారు. తాజాగా వారంతా విడుదలయ్యారు. దీంతో ఈరోజు ఏడుగురు భారత్ కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రధాని మోదీ వల్లే ఇది సాధ్యమైందని, ఈ రోజు తాము  తిరిగి భారత్ కు రాగలిగామని తెలిపారు.

భారతీయ పౌరులను విడుదల చేయాలనే ఖతార్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. వారు తిరిగి వచ్చేందుకు వీలు కల్పించినందుకు ఖతార్ అమీర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. దౌత్యపరమైన నిర్ణయానికి భారత్ ప్రశంసలను వ్యక్తం చేస్తూ, నావికాదళపు అనుభవజ్ఞులైన అధికారులను విడుదల చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

 “కతార్‌లో నిర్బంధించబడిన దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. వారిలో ఎనిమిది మందిలో ఏడుగురు భారతదేశానికి తిరిగి వచ్చారు. వీరి విడుదల, స్వదేశానికి వెళ్లేందుకు వీలుగా ఖతార్ ప్రభుత్వ అమీర్ తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము”  అని తెలిపింది.

ఖైదీలకు కాన్సులర్, చట్టపరమైన సహాయం అందించడానికి విదేశాంగ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.  ఖతార్ అధికారులతో ఈ విషయంపై సంప్రదింపులు కొనసాగిస్తానని స్పష్టం చేసింది. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నందున, ప్రమేయం ఉన్న భారతీయ పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని తెలిపింది. 

ఖతార్‌లో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది భారత నేవీ అధికారులలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రగేష్ ఉన్నారు.