రాజ్య‌స‌భలో క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఎంపీ జ‌యా బ‌చ్చ‌న్‌

సమాజ్‌వాదీ పార్టీ ఎంపి జయాబచ్చన్‌ రాజ్యసభలో చేతులు జోడించి మరీ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. సభలో కొన్ని సందర్భాలలో జయాబచ్చన్‌ ఆవేశంగా మాట్లాడుతుంటారు.  ఎంపీ జ‌యాబ‌చ్చ‌న్ సాధార‌ణంగా ఎప్పుడూ కోపంగా ఉంటుంది. ఆమె మాట తీరు కూడా క‌ఠినంగా ఉంటుంది.  ఇటీవ‌ల రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌పై కూడా ఆమె ఆవేశంలో కామెంట్ చేశారు. అయితే ఫేర్‌వెల్ స్పీచ్ సంద‌ర్భంగా జ‌యాబ‌చ్చ‌న్ మాట్లాడుతూ తానో షార్ట్ టెంప‌ర్ వ్య‌క్తిన‌ని పేర్కొంటూ ఎవ‌ర్నీ బాధ పెట్ట‌డం త‌న ఉద్దేశం కాద‌ని స్పష్టం చేశారు.

రాజ్యసభలో తన చివరి ప్రసంగం సందర్భంగా జయాబచ్చన్‌ మాట్లాడుతూ ‘నేను షార్ట్‌ టెంపర్‌ వ్యక్తిని. కానీ ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. నాకు ఎందుకు కోపం వస్తుందని నన్ను తరచు అడుగుతంటారు. అది నా స్వభావం. దాన్ని నేను మార్చుకోలేను. నేను ఏదైనా ఇష్టపడకపోయినా.. లేదా అంగీకరించకపోయినా నేను నా సహనాన్ని కోల్పోతాను. నేను మీలో ఎవరితోనైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే నేను క్షమాపణలు కోరుతున్నాను.’ అని ఆమె చేతులు జోడించారు. 

జయాబచ్చన్‌ మాట్లాడిన అనంతరం రాజ్యసభ ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధనకర్‌ మాట్లాడుతూ జయాబచ్చన్‌కున్న అపారమైన జ్ఞానాన్ని చాలా మిస్‌ అవుతామని, ఆమె లోటును పూరించలేనిదని తెలిపారు.

కాగా, రాజ్యసభ చైర్మన్ థన్‌ఖఢ్ గత మంగళవారంనాడు ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నను విడిచిపెట్టి మరో ప్రశ్నను ముందుకు తీసుకురావడంతో కాంగ్రెస్ నేత ఒకరు నిలదీశారు. దీనిపై ధన్‌ఖఢ్ ఆయనను మందలించారు. దీంతో జయాబచ్చన్ జోక్యం చేసుకుంటూ, ఎందుకు అలా జరిగిందో చెబితే సభ్యులు అర్ధం చేసుకుంటారని, వాళ్లేమీ చిన్నపిల్లలు కాదని ధన్‌ఖఢ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తర్వాత కొద్దిసేపటికే వ్యవహారం చక్కబడింది.