అసోం- మిజోరం సీఎంల మధ్య సరిహద్దు ఒప్పందం

అసోం- మిజోరం రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదానికి భవిష్యత్తులో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని సంయుక్తంగా పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

అసోం రాజధాని గువాహటి పర్యటనలో ఉన్న మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమాను అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ భోజనానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమావేశమైన ఇద్దరు ముఖ్యమంత్రులు సరిహద్దు సమస్యపై చర్చించారు. రెండు రాష్ట్రాలు కలిసి సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యపై చర్చలు జరిగేదాకా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పాలని కూడా రెండు రాష్ట్రాలు ఒప్పందంలో రాసుకున్నాయి. అసోం బడ్జెట్‌ సమావేశాలు ముగియగానే సరిహద్దు ఇన్‌చార్జి మంత్రిని మిజోరంకు పంపిస్తాని లాల్దుహోమాతో హిమాంత చెప్పారు.

కాగా, అసోం-మిజోరం రాష్ట్రాల మధ్య మిజోరంలోని ఐజ్వాల్‌, కోలాసిబ్‌, మమిట్‌ జిల్లాలు, అసోంలోని చాచర్‌, కరీమ్‌గంజ్‌, హైలన్‌కండి జిల్లాలు 164.6 కిలోమీటర్ల పొడవును సరిహద్దును పంచుకుంటున్నాయి. బెంగాల్‌ ఈస్టర్న్‌ ఫ్రాంటియర్‌ రెగ్యలేషన్‌ -1873 కింద 1875లో నోటిఫై చేసిన ప్రకారం ఇన్నర్‌ లైన్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 509 చదరపు మైళ్ల విస్తీర్ణం తమదేనని మిజోరాం వాదిస్తోంది.

మరోవైపు 1933లో సర్వే ఆఫ్‌ ఇండియా గీసిన రాజ్యాంగ సరిహద్దు ప్రకారం తమ భూభాగమే మిజోరంలో ఉన్నదని అసోం వాదిస్తున్నది. ఇన్నర్‌ లైన్‌ రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌ ప్రస్తుతం అసోంలో ఉండగా,1933 సరిహద్దు ప్రకారం అసోంలో ఉండాల్సిన ఏరియా మిజోరంలో ఉన్నది. నాడు క్షేత్ర స్థాయిలో ఎలాంటి సరిహద్దులు గీయకపోవడం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది.

రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం జులై, 2021లో రెండు రాష్ట్రాల మధ్య పోలీసుల ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పులలో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు, ఓ పౌరుడు మృతి చెందారు.