పీవీ న‌ర్సింహారావు, చ‌ర‌ణ్‌సింగ్‌, స్వామినాథ‌న్‌ల‌కు భార‌త ర‌త్న‌

పీవీ న‌ర్సింహారావు, చ‌ర‌ణ్‌సింగ్‌, స్వామినాథ‌న్‌ల‌కు భార‌త ర‌త్న‌
తెలంగాణ ముద్దుబిడ్డ‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. మాజీ ప్ర‌ధాని పీవీ నరసింహారావుకు భార‌త‌ర‌త్నను ప్ర‌క‌టించారు. పీవీ న‌ర్సింహారావుతో పాటు మ‌రో మాజీ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్‌సింగ్‌, వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త ఎంఎస్ స్వామినాథ‌న్‌లకు కూడా కేంద్రం ఇవాళ భార‌త ర‌త్న అవార్డును ప్ర‌క‌టించంది. 
 
పీవీ న‌ర్సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వ‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోదీ సంతోషం వ్య‌క్తం చేశారు. పీవీ ఓ మేధావి అని, రాజ‌నీత‌జ్ఞుడు అని త‌న ఎక్స్ అకౌంట్‌లో మోదీ కీర్తించారు. విభిన్న హోదాల్లో నరసింహారావుప‌నిచేసిన‌ట్లు వెల్ల‌డించారు. మ‌రో మాజీ ప్ర‌ధాని చౌద‌రీ చ‌ర‌ణ్ సింగ్‌కు కూడా భార‌త‌ర‌త్న ఇచ్చి త‌మ ప్ర‌భుత్వం గౌర‌వించింద‌ని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయ‌న త‌న జీవితాన్ని అంకితం చేశార‌ని తెలిపారు. శాస్త్ర‌వేత్త స్వామినాథ‌న్‌కు కూడా భార‌త ర‌త్న ఇవ్వ‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోదీ సంతోషం వ్య‌క్తం చేశారు.
 
ఇప్పటికే బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వాణీ, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌లకు ఈ ఏడాది భారతరత్నను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుతం అవార్డుకు ఎంపికైన వారిలో ఎల్ కే అద్వానీ మాత్రమే జీవించి ఉన్నారు.

పీవీ నరసింహారావు 1991 నుంచి 1996 వరకూ ప్రధానిగా కొనసాగారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించిన ఘనత పీవీకే దక్కుతుంది. ఆయన హయాంలో తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణలే ప్రస్తుతం దేశాన్ని సుస్థిరం చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక, పండితుడు, రాజనీతిజ్ఞుడైన పీవీ దేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా చేసిన కృషి మరువలేనివి. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది. దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేసింది.

‘ఓ రాజనీతిజ్ఞుడిగా ఈ దేశానికి పీవీ నర్సింహారావు వివిధ హోదాల్లో విస్తృతమైన సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధాన మంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో పీవీ దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది. ఈ దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేసింది’ అని ప్రధాని మోదీ తెలిపారు.

భారతదేశం ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడింది పీవీ హయాంలోనే అని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. దేశం ఆర్థికాభివృద్ధి దిశగా కొత్త అడుగులు వేసింది కూడా ఆయన పాలనలోనే అని వివరించారు. విదేశాంగ నిపుణుడిగా, విద్యా రంగ కోవిదుడిగా పీవీ అందించిన సహకారం భారతదేశాన్ని సాంస్కృతికంగా, మేథో పరంగా సుసంపన్నం చేసిందని కీర్తించారు.

మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌కు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడం తమ ప్రభుత్వం చేసుకున్న అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన ఎనలేని సేవలకు ఈ పురస్కారం అంకితం అని మోదీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. చరణ్‌ సింగ్‌ తన జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమం కోసమే అంకితం చేశారని ప్రధాని కొనియాడారు.

చరణ్‌ సింగ్‌ ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గానీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ, కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు గానీ దేశ అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా ఆయన గట్టిగా నిలబడ్డారని గుర్తుచేశారు. రైతు సోదరసోదరీమణుల పట్ల ఆయన చూపిన అంకితభావం, ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసి కృషి యావత్‌ భారతదేశానికి ఆదర్శనీయమని మోదీ పేర్కొన్నారు.

భారత దేశ హరిత విప్లవ పితామహుడిగా మన్ననలు అందుకున్న వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్.. వ్యవసాయ రంగంలో చేసి విశేష సేవలకు కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించింది. 

సవాళ్ల సమయంలో భారతదేశం వ్యవసాయంలో స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. స్వామినాథన్ దార్శనిక నాయకత్వం భారతీయ వ్యవసాయాన్ని మార్చడమే కాకుండా దేశ ఆహార భద్రత, శ్రేయస్సుకు హామీ ఇచ్చింది.

భారత హరిత విప్లవానికి ఆద్యుడు ఎంఎస్ స్వామినాథన్ గా ప్రసిద్ధి చెందిన మంకొంబు సాంబశివన్ స్వామినాథన్ నూతన వంగడాల సృష్టితో ఆహార ధాన్యాల కొరతను అధిగమించేలా చేశారు. 1959 లో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో యువ శాస్త్రవేత్తగా స్వామినాథన్ వృత్తి జీవితం ప్రారంభించారు. అమెరికన్ వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ తో కలిసి భారతీయ పరిస్థితులకు తగిన అధిక దిగుబడినిచ్చే మెక్సికన్ గోధుమ రకాన్ని స్వామినాథన్ రూపొందించారు. భారతదేశం ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో పంజాబ్, హర్యానాలో వాటిని ప్రారంభించారు.