‘పేటీఎం’పై ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తాం

ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’, దాని అనుబంధ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిలెడ్ (పీపీబీఎల్)కు బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు రెగ్యులేటరీ నిబంధనలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కానీ పరిస్థితి మెరుగు పడలేదని పేకరోన్తు బాధ్యతాయుతమైన నియంత్రణ సంస్థగా నిబంధనలను పాటించని సంస్థ ‘పేటీఎం’పై నియంత్రణ చర్యలు చేపట్టామని తెలిపారు. 

మూడు రోజులుగా జరిగిన ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) సమీక్షా నిర్ణయాలను గురువారం శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించిన సందర్భంగా పేటీఎం నిబంధనల ఉల్లంఘనపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.  కొన్ని రోజులుగా ప్రజల నుంచి పలు ప్రశ్నలు తమకు వస్తున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని వచ్చేవారం ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తామని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. 

డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణతోపాటు వ్యవస్థలో సుస్థిరత లక్ష్యంగా తమ చర్యలు ఉంటాయని తెలిపారు. రెగ్యులేటరీ నిబంధనల అమలులో రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ‘పేటీఎం’ ఒక సంస్థ మాత్రమేనని, మొత్తం ఫిన్ టెక్ సర్వీస్ రంగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

శక్తికాంత దాస్‌తోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే మాట్లాడుతూ పేటీఎం నిరంతరం నిబంధనలను ఉల్లంఘించడం వల్లే రెగ్యులేటరీ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొన్ని నెలలు, కొన్ని సందర్భాల్లో ఏండ్ల తరబడి చర్చల తర్వాత ఆంక్షలు విధించినట్లు చెప్పారు. 

జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు కొంత సమయం కూడా కేటాయించామని తెలిపారు. రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందు వల్ల ఫిబ్రవరి 29 నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్ల స్వీకరణ, క్రెడిట్ రుణ పరపతి, టాపప్ రుణ పరపతి కల్పించరాదని ఆర్బీఐ గత నెల 31న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే