అమెరికాలో ఈ ఏడాది ఇదో భారతీయ విద్యార్థి మృతి

ఇటీవలి కాలంలో అమెరికాలో అనూహ్యమైన పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులు మరణిస్తూండటం కలవరం కలిగిస్తోంది. తాజాగా ఈ జాబితాలో మరో విద్యార్థి చేరాడు. సమీర్ కామత్ అనే 23 ఏళ్ల విద్యార్థి మృతదేహాన్ని వారెన్ కౌంటీ పోలీసులు సోమవారం సాయంత్రం కనుగొన్నారు. సమీర్ చదువుతున్న పర్డ్యూ యూనివర్శిటీకి సమీపంలోని అడవిలో అతని మృతదేహం లభించింది. 

ఈ ఏడాదిలో అమెరికాలో భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ఇది వరుసగా ఐదో ఘటన కావడం గమనార్హం. సమీర్ పర్డ్యూ వర్శిటీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన రెండో భారతీయ విద్యార్ధి కావడం గమనార్హం.  ఇటీవల నీల్ ఆచార్య అనే విద్యార్థి మృతదేహం యూనివర్శిటీ ప్రాంగణంలోనే కనిపించింది. నీల్ కనిపించడం లేదని అతని తల్లి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

అంతకు ముందు వారం ఓహియో ప్రాంతంలో భారత సంతతికి చెందిన 19 ఏళ్ల శ్రేయస్ రెడ్డి ఇదే విధంగా మృతి చెందాడు. జార్జియాలోని లిథోనియాలో హర్యానాకు చెందిన వివేక్ సైనీ అనే భారతీయ విద్యార్థిని ఓ వ్యక్తి సుత్తితో కొట్టి దారుణంగా చంపిన విషయం తెలిసిందే.  తాజాగా చికాగోలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిపై ముగ్గురు దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వీడియో కలకలం సృష్టిస్తోంది.

ఇక గత నెలలో ఇల్లినాయిస్ యూనివర్శిటీ సమీపంలో భారతీయ-అమెరికన్ విద్యార్థి అకుల్‌ ధవన్‌ శవమై కనిపించాడు. ఇలా భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి

సమీర్ కామత్ పర్డ్యూ యూనివర్శిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ చేస్తున్నాడు. 2023 ఆగస్టులో మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం అదే విభాగంలో డాక్టరేట్ చేస్తున్నాడు. సమీర్ కు యుఎస్ పౌరసత్వం కూడా ఉంది. అతని మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. సమీర్ మృతదేహానికి మంగళవారం సాయంత్రం పోస్ట్ మార్టం పూర్తయింది.