ఉత్తరాఖండ్ లో అసెంబీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు

* సహజీవనం నమోదు కావాల్సిందే!
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టారు. భారత దేశంలో ఇటువంటి బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ బిల్లు కోసమే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఉమ్మడి పౌరస్మృతిని అమలు పరచే మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ కాగలదు.
 
ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ, ఉమ్మడి పౌరస్మృతి “అన్ని వర్గాల మేలు కోసం” ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఏ బిల్లుపై ఇతర పార్టీల సభ్యులు కూడా  చర్చించాలని ఆయన కోరారు.  ఈ బిల్లు కోసం మొత్తం భారత దేశం ఎదురు చూస్తోందని చెప్పారు. 
 
ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర శాసనసభకు భారత రాజ్యాంగం అసలు ప్రతిని చేతిలో చూపుతూ ముఖ్యమంత్రి వచ్చారు. ఈ సందర్భంగా `జై శ్రీరామ్’, `వందే మాతరం’ అంటూ బిజెపి సభ్యులు నినాదాలు ఇచ్చారు.
 
కాగా, ఈ బిల్లు ప్రకారం  ఉత్తరాఖండ్‌లో `సహజీవనం’ జరిపేవారు కూడా జిల్లా అధికారులతో వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో జరిమానా, జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, 2024 `సహజీవనం’లో జన్మించిన బిడ్డలను కూడా చట్టబద్ధంగా పరిగణించాలని స్పష్టం చేస్తుంది.
 
కేవలం ఉత్తరాఖండ్ నివాసులు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో `సహజీవనం’ జరుపుతున్న వారంతా తమ సంబంధానికి సంబంధించి సంబంధిత రిజిస్ట్రార్ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. `సహజీవనం’ చేస్తున్నవారిలో ఏ ఒక్కరు మైనర్ అయినా నమోదు చేయరు. ఇద్దరిలో ఒకరైనా 21 ఏళ్లకు తక్కువ వయస్సు కలిగి ఉంటె, వారి తల్లితండ్రులు  లేదా సంరక్షుకులకు తెలుపుతారు.
 
`సహజీవనం’లో ఏ ఒక్కరి సమ్మతిని బలవంతంగా, ఒత్తిడితో, ఒకరికి సంబంధించిన వివరాలను కప్పిపుచ్చి పొందినా నమోదు చేయరు. ఎవరైనా `సహజీవనం’ను నమోదు చేసుకోకుండా ఒక నెల కంటే ఎక్కువ కాలం గడిపితే మూడు నెలల వరకు జైలు శిక్ష, రూ 10,000 జరిమానాకు
 
నమోదు చేసుకొనేందుకు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తికి మూడు నెలల జైలుతో పాటు ఏక్కువ జరిమానా విధించే అవకాశం ఉంది. `సహజీవనం’లోని స్త్రీ భాగస్వామిని విడిచిపెట్టినట్లయితే, ఆమె అతని నుండి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అర్హురాలు అవుతారు. ఆమె అందుకోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని బిల్లు పేర్కొంది.  షెడ్యూల్డ్ తెగలను మినహాయించి ఉత్తరాఖండ్‌లో మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వంపై ఉమ్మడి చట్టాన్ని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.
 
ఆదివారం ముఖ్యమంత్రి ధామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం ఈ బిల్లు ముసాయిదాను ఆమోదించింది. మే 2022లో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఈ ముసాయిదాను సిద్ధం చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పెర్మోద్ కోహ్లీ,  సామాజిక కార్యకర్త మను గౌర్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శత్రుఘ్న సింగ్,  డూన్ యూనివర్శిటీ వైస్ చంకలర్ సురేఖా దంగ్వాల్‌లతో పాటు జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడింది.


ముసాయిదా లింగ సమానత్వాన్ని కోరుతూ, పూర్వీకుల ఆస్తులలో వారసత్వంగా మహిళలకు సమాన హక్కులు, దత్తత, విడాకులు తీసుకోవడానికి సమాన హక్కులు, మతంతో సంబంధం లేకుండా బహుభార్యాత్వంపై నిషేధం వంటి నిబంధనలను సూచించింది. ప్యానెల్ అన్ని మతాల్లోని బాలికలకు సాధారణ వివాహ వయస్సును, అన్ని మతాలలో విడాకుల కోసం ఒకే విధమైన  విధానాలను అమలు చేయాలని కూడా  సూచించింది.