చండీగఢ్ మేయర్‌ ఎన్నికలపై`సుప్రీం’ ఆగ్రహం

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని తాము అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి చేసిన పని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లేనని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మండిపడ్డారు.  ‘ఆయన కెమెరా వైపు చూస్తూ బ్యాలెట్ పేపర్లు పాడు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు.
సాయంత్రం 5 గంటలలోపు ఎన్నికలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు.  కాగా, మంగళవారం జరగాల్సిన భావించిన చండీగఢ్ పాలనా యంత్రాంగం బడ్జెట్ సెషన్‌ను కూడా సుప్రీంకోర్టు స్తంభింపజేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బడ్జెట్‌ను సమర్పించవద్దని న్యాయమూర్తులు చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. జనవరి 30న జరిగిన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌కు చెందిన 8 ఓట్లు చెల్లవని రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ పేర్కొన్నారు. దీంతో 16 ఓట్ల పొందిన బీజేపీ అభ్యర్థి మనోజ్ సొంకర్  గెలుపొందగా,12 ఓట్లు పొందిన ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఓటమి చెందారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) దీనిపై తొలుత పంజాబ్‌- హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రిసైడింగ్ అధికారి ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. బ్యాలెట్ పేపర్లను ట్యాంపరింగ్ చేసిన ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని తన పిటిషన్‌లో ఆప్‌ పేర్కొంది. బ్యాలెట్ పేపర్లను తారుమారు చేయడంతో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలో చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.