ప్రశ్నాపత్రం లీక్ చేస్తే రూ 1 కోటి జరిమానా

పోటీ పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి డబ్బులు దండుకునే వారికి కేంద్ర ప్రభుత్వం చెక్‌ పెట్టనుంది. ప్రశ్నాపత్రాలు  లీకేజీ లాంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్ ‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌-2024) బిల్లును కేంద్ర సర్కారు సోమవారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది.

కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌ ఈ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడే అధికారులు, ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్లెం పడే అవకాశం ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే.. ఈ చట్టం కింద నిందితులకు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష, నేర తీవ్రతను కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు.

రాజస్థాన్‌, హర్యానా, గుజరాత్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా బిల్లును తీసుకువచ్చింది. కాగా, పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ బిల్లును తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.