ఏపీలో జనసేన – బీజేపీ పొత్తు కొనసాగుతుంది

ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులోనే కొనసాగుతుందని, ఇతర పార్టీలతో కలిసి సాగే విషయంలో నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు. జనసేనతో తమ పార్టీ పొత్తు మాత్రం కొనసాగిస్తూనే పార్టీని బలోపేతం చేయడంపై తాము దృష్టి పెడుతున్నట్టు చెప్పారు.

ఇటీవల 25 పార్లమెంటు నియోజక వర్గాల్లో పార్లమెంటులో కార్యాలయాలు ప్రారంభించారని గుర్తు చేశారు.  విజయవాడలో జరిగిన లీగల్ సెల్ ప్రారంభ సమావేశంలో పాల్గొంటూ ఏపీలో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని తెలిపారు.  రాష్ట్రంలో సర్పంచ్ లకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని పురందేశ్వరి ఆరోపించారు. గ్రామీణాభివృద్ది కోసం కేంద్రం నిధులు ఇస్తే వాటిని కూడా సొంత ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని ఆరోపించారు.

 దీనిపై రాష్ట్ర బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. టీడీపీ, వైసీపీతో పాటు జనసేన సర్పంచ్ లు కూడా బీజేపీ ఆందోళనకు మద్దతు పలికారని ఆమె చెప్పారు.  కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఒక కమిటీని రాష్ట్రానికి పంపారని, కేంద్రం గ్రామాల కు ఇచ్చిన నిధులు, ఉపాధి హామీ కోసం వచ్చిన నిధులను దారి మళ్లించినట్లు కమిటీ నిర్ధారించిందని ఆమె వెల్లడించారు. .

వైసీపీ పాలనలో గ్రామాలలో అభివృద్ది అనేది కాన రాకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. అనేక మంది సర్పంచ్ లు సొంత డబ్బుతో గ్రామాలలో అభివృద్ది పనులు చేశారని, వారికి బిల్లులు కూడా జగన్ చెల్లించకపోవడంతో.. పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె ఆరోపించారు.

ఏపీలో రోడ్ల పరిస్థితి, తాగునీటి వసతి లేక.. సర్పంచ్‌లు సీఎంను నిలదీసే పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి స్పందించక పోవడంతోనే  సర్పంచ్ లు ఆవేదన వెలిబుచ్చేందుకు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారన్నారు. సర్పంచ్ లను అరెస్టులు చేయడం వైసీపీ ప్రభుత్వ నియంతృత్వాన్ని తెలియ చేస్తుందని ఆమె మండిపడ్డారు.