అయోధ్యకు కొవ్వూరు నుండి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట తర్వాత దేశవ్యా్ప్తంగా ఉన్న అందరి చూపు అయోధ్యపురిపైనే ఉంది. అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే విమానం, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.  అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైలు సర్వీసులు కూడా నడుస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ కూడా  తాజాగా అయోధ్యకు వెళ్లేవారి కోసం ఇప్పుడు ప్రత్యేక సర్వీసులు తెచ్చింది.

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డిపో అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం రెండు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీసులు అయోధ్య మీదుగా కాశీవరకూ అందుబాటులో ఉన్నాయి.  ఈ రెండు సర్వీసులను కూడా సూపర్ లగ్జరీ రేంజులో ఏర్పాటుచేశారు కొవ్వూరు డిపో అధికారులు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భువనేశ్వర్‌, పూరీ, కోణార్క్, జాజిపూర్, ప్రయాగ్, అయోధ్యతో పాటు పలు పుణ్యక్షేత్రాలు కవర్ అయ్యేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. 

తక్కువ ఖర్చులోనే తీర్థయాత్రలకు వెళ్లాలనుకునేవారికి కొవ్వూరు డిపో తీసుకువచ్చిన ఈ సౌకర్యం ప్రయోజనం కలిగిస్తుందనే చెప్పొచ్చు. మరోవైపు ఈ సర్వీసుల్లో ప్రయాణం కోసం ఒక్కొక్క ప్రయాణికుడికి టికెట్ ధర రూ.11,500 గా కొవ్వూరు ఆర్టీసీ నిర్ణయించింది.