రూ.2.86లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌

2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86, 389 కోట్లతో ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ. 2,30,110 కోట్లు రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంగా పేర్కొంది. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం ద్రవ్యలోటు, జీఎస్‌డీపీలో రెవెన్యూలోటు 1.56 శాతమని ఆర్థిక బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 
 
 ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్న ఆయన మేనిఫెస్టోను సీఎం జగన్‌ పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పారు.  లక్ష 35వేల మంది ఉద్యోగాలతో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేశామని,  రెండున్నర లక్షల మంది వాలంటీర్లతో గడపగడపకూ పాలన అందుతుందన్నదని తెలిపారు.  ప్రతి విద్యార్థికి టోఫెల్ ధృవీకరణ పత్రం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, విద్యా ప్రమాణాల మెరుగు కోసం 9,52,927 ట్యాబ్‌లను పంపిణీ, 34.30లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచామని పేర్కొన్నారు. వెయ్యి స్కూళ్లలో సీబీఎస్ఐ సిలబస్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

పాలనా వికేంద్రీకరణతో పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెబుతూ పాలనా విభాగాలను పునర్వవస్థీకరించి అన్ని వర్గాల వారికి సాధికారత అందించామని చెప్పారు. విద్యార్ధులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా పాఠశాల్లలో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. వెయ్యి పాఠశాలల్లోని 4,39,395 మంది విద్యార్థులను సీబీఎస్ఈ పరిధిలోకి తీసుకువచ్చినట్లు వివరించారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్యప్రణాళిక, ప్రతీ విద్యార్థికి టోఫెల్ ధ్రువీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా..రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఆంధ్రప్రదేశ్‌ మారిందని తెలిపారు. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు జగన్‌ ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. 

సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణాంధ్ర, సంక్షేమాంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్రను సాధించామని చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.2356 కోట్లతో పనులు చేపట్టామని, సామర్థ్య ఆంధ్రా ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నామని, మానవ మూలధన అభివృద్ధికి ఐదేళ్లుగా ప్రాధాన్యతాక్రమంలో పెట్టుబడి ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ట్యాబ్‌లను అందించడం ద్వారా బోధన, అభ్యాస ఫలితాలు మెరుగయ్యాయని ఆర్ధిక మంత్రి వివరించారు.

నాల్గో తరగతి నుంచి 12వ తరగతి వరకు 34.30లక్షల మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులయ్యారని, నాడు నేడు ద్వారా ఐదేళ్లలో 99.81శాతం పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించామని పేర్కొన్నారు. మొత్తం రూ.7,163 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాల ద్వారా పోషణా లోపాన్ని 2023 నాటికి 6.84 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. విదేశీ విద్యాదీవెన ద్వారా 1,858 మంది విద్యార్థులకు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అందేలా చర్యలు తీసుకున్నామని బుగ్గన వివరించారు.