జనసేనకు 25 అసెంబ్లీ, మూడు లోక్‌సభ సీట్లు!

సీట్ల సర్దుబాటుపై టీడీపీ -జనసేన మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం మధ్యాహ్నం, రాత్రి పొద్దుపోయాక రెండు విడతలుగా   ఏకాంతంగా,సుదీర్ఘంగా సమావేశమయ్యారు. జనసేన 32 అసెంబ్లీ టిక్కెట్లు, మూడు లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. 

అయితే, నియోజక వర్గాల్లో ఉన్న బలాబలాల దృష్ట్యా ఎన్నికలలలోపోటీకి సిద్ధపడాలని జనసేనను చంద్రబాబు ఒప్పించినట్లు తెలుస్తోంది. ఆదివారం నాటికి దాదాపు 20 స్థానాల్లో జనసేన అభ్యర్థులపై స్పష్టత వచ్చినా మరో నాలుగైదు స్థానాలను ఆ పార్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి.  రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్‌, యలమంచిలి, భీమవరం, పోలవరం, బెజవాడ వెస్ట్‌, తెనాలి, దర్శి వంటి స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది.

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.  కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు. వీటితో పాటు అనకాపల్లి లేదా తిరుపతి స్థానం కూడా ఇవ్వాలని కోరుతున్నారు.  ఉమ్మడి జిల్లాల వారీగా జనసేన కోరిన స్థానాల్లో విజయనగరంలో 1, విశాఖపట్నం-6, తూర్పుగోదావరి-6, పశ్చిమ గోదావరి-4, కృష్ణా-3, గుంటూరు-2, ప్రకాశం-2, నెల్లూరు-2, కడప-1, చిత్తూరు-2, కర్నూలు-1, అనంతపురంలో 2 ఉన్నట్లు తెలుస్తోంది. 

ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లను జనసేన కోరుతోంది. వీటిలో రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్‌, యలమంచిలి, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ (పశ్చిమ), తెనాలి, దర్శి సహా 20 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెబుతున్నారు.  14వ తేదీన పాలకొల్లులో ఉమ్మడి సభ నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఈ నెల 8న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రెండు పార్టీల నేతలు మరోసారి సమావేశం కానున్నారు. 8వ తేదీ నాటికి రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణపై స్పష్టత వస్తుంది.