హౌతీలే లక్ష్యంగా అమెరికా, ఇంగ్లాండ్ భీకర దాడులు

గతవారం జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడికి అగ్రరాజ్యం ప్రతీకారం తీర్చుకుంటున్నది. శుక్రవారం ఇరాక్‌, సిరియాలోని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డుల మద్దతు కలిగిన 85కు పైగా మిలీషియా స్థావరాలపై అమెరికా యుద్ధవిమానాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. 
 
తాజాగా యూకేతో కలిసి అమెరికా సైన్యాలు యెమెన్‌లోని హౌతి రెబల్స్‌ను  లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఫైటర్‌ జెట్లతోపాటు వాయు, భూతలం నుంచి పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపించాయి. హౌతీలకు చెందిన కమాండ్‌ కంట్రోల్‌తోపాటు యెమెన్ లో 13 ప్రదేశాలలో గల 36 స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం తెలిపింది.

యెమెన్‌ను స్థావరంగా చేసుకున్న హౌతీ రెబల్స్‌ ఇజ్రాయెల్‌ సైన్యాలు గాజాలోని పాలస్తీనియన్లను చంపడానికి నిరసగా అమెరికా, దాని భాగస్వామ్య దేశాలపై దాడులకు పాల్పడుతున్నది. ఇందులో భాగంగా ఎర్రసముద్రంలో గతకొంత కాలంగా వాణిజ్య నౌకలను డ్రోన్‌ బాంబుల సాయంతో ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే.

అందుకనే అంతర్జాతీయ వాణిజ్యంకు ఆటంకాలు కలిగించడంతో పాటు అమాయక ప్రజలను వాదిస్తున్న హౌతీ తిరుగుబాటుదారుల సామర్ధ్యాలను విచ్ఛిన్నం చేయడమే ఈ దాడుల లక్ష్యం అని అమెరికా స్పష్టం చేసింది. అదేవిధంగా, శనివారం యెర్ర సముద్రంలో నౌకలపై దాడులకు సిద్ధపడుతున్న  హౌతీ లకు చెందిన  ఆరు క్షీపనులను కూడా ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.

కాగా, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్, అనుబంధ మిలీషియా గ్రూపులే లక్ష్యంగా ఇరాన్, సిరియాల్లోని 85 లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా శనివారం ప్రకటించింది. గత ఆదివారం జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందగా మరో 40 మందికి పైగా గాయపడ్డారు. 

ఈ ఘటనను అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. ఇరాన్‌ అనుకూల మిలీషియా గ్రూపులే కారణమని ఆరోపిస్తూ ఇందుకు ప్రతీకారం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది.  అమెరికన్ల జోలికి వస్తే ఇలాగే ఉంటుందని, ఎట్టిపరిస్థితుల్లో ఊరుకునేది లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరించారు.

శుక్రవారం అమెరికా నుంచి బయలుదేరిన బీ1- లాంగ్‌రేంజ్‌ బాంబర్‌ విమానాలు ఇరాన్‌లోని సరిహద్దు పట్టణం అల్‌-క్వయిమ్‌ కేంద్రంగా పనిచేసే ఇరాన్‌ అనుకూల హష్ద్‌-అల్‌- షబి, కతాయిబ్‌ హెజ్బొల్లా సంస్థల స్థావరాలతోపాటు మొత్తం ఏడు ప్రాంతాల్లోని 85 లక్ష్యాలపై బాంబులతో ధ్వంసం చేసినట్లు బైడెన్‌ చెప్పారు.