పీఠాధిపతులు, మఠాధిపతుల ఆశీస్సులతో గొప్పగా ధర్మ ప్రచారం

మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభమైంది.
 
ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ భారతదేశం పవిత్రభూమి అని, ఇక్కడే వేదాలు ఆవిర్భవించాయని, సాక్షాత్తు విష్ణుమూర్తి వారు శ్రీరామ, శ్రీకృష్ణ రూపాల్లో అవతరించారని చెప్పారు. ఈ దేశంలోనే ధర్మాచరణకు దిక్సూచిగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా అవతరించారని తెలిపారు. 
 
స్వామివారి ఆశీస్సులతో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుంచి సముచితమైన సూచనలను, సలహాలను స్వీకరిస్తామని చెప్పారు.
 
మొదటిరోజు సదస్సుకు 25 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు. వారిలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, బెంగళూరు శ్రీ వ్యాసరాజ మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థ స్వామీజీ, కుర్తాళం మౌనస్వామి మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతిస్వామి, తిరుపతి రాయలచెరువుకు చెందిన భారతి శక్తిపీఠం మాతృశ్రీ రమ్యానంద, విజయవాడకు చెందిన శ్రీశ్రీశ్రీ అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి, భీమవరానికి చెందిన భాష్యకార సిద్ధాంత పీఠం శ్రీశ్రీశ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, శ్రీనివాసమంగాపురానికి చెందిన శ్రీ లలితా పీఠం శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామి,  ఏర్పేడు వ్యాసాశ్రమానికి చెందిన శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానందగిరి స్వామి, కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ, కడప బ్రహ్మంగారి మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామి, గుంటూరుకు చెందిన శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజి, తుని తపోవనానికి చెందిన శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి తదితరులు ఉన్నారు.